
- పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం
- మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. కోరమీసాల కొమురవెల్లి మల్లన్న.. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ మెడలో మూడు ముళ్లు వేశారు. మల్లికార్జునస్వామి కల్యాణ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొమురవెల్లిలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన ఈ కల్యాణ వేడుకలో ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారికి బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
కల్యాణం సాగింది ఇలా..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఏటా మార్గశిర మాసం ఏకాదశి రోజున నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే మొదట గర్భగుడిలోని మల్లికార్జునస్వామి, అమ్మవార్ల మూలవిరాట్ లకు కల్యాణం చేశారు. మూలవిరాట్ దగ్గర బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల తరఫున మహదేవుడి వంశస్తుల దంపతులు, వరుడు మల్లికార్జునస్వామి తరఫున పడిగన్నగారి వంశస్తుల దంపతులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయం నుంచి మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా తోట బావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం12.30 గంటలకు అమ్మవార్లకు మంగళసూత్రధారణ చేశారు. ఉజ్జయిని పీఠాధిపతులు శ్రీ1008 జగద్గురు సిదలింగరాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామీజీ పర్యవేక్షణలో కల్యాణ వేడుకలు నిర్వహించారు.
ఏడాదిలోపు స్వర్ణ కిరీటాలు: మంత్రి సురేఖ
కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని అమ్మవార్లు మేడలదేవి, గొల్లకేతమ్మలకు రెండు స్వర్ణ కిరీటాలను వచ్చే కల్యాణోత్సవం వరకు చేయించి అలంకరిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. కొమురవెల్లిలో మల్లన్న కల్యాణ వేడుకలకు మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, నాగపురి రాజలింగం, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, టెంపుల్ ఈఓ బాలాజీ పాల్గొన్నారు.
జేబు దొంగల చేతి వాటం
మల్లన్న కల్యాణోత్సవంలో జేబు దొంగలు చేతి వాటాన్ని ప్రదర్శించారు. తోటబావి దగ్గర పలువురి పర్సులు కొట్టేశారు. జనగామకు చెందిన ప్రమీల అనే వృద్ధ మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసు కొట్టేశారు.
కాన్వాయ్‌కోసం మంత్రి వెయిటింగ్
పోలీసులు, భద్రతా అధికారుల మధ్య సమన్వయ లోపంతో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అరగంట పాటు కాన్వాయ్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికీ కాన్వాయ్ రాకపోవడంతో సొంత కారులోనే ఆమె గెస్ట్‌హౌస్ కు వెళ్లిపోయారు. కల్యాణం అనంతరం గెస్ట్ హౌస్ వెళ్లేందుకు బయటకు వచ్చిన మంత్రికి ఎస్కార్ట్ వాహనాలు కనిపించలేదు. పోలీసులకు చెప్పినా కాన్వాయ్కల్యా ణ వేదిక దాకా చేరుకోలేకపోవడంతో ఆమె అర గంట వేచిచూశారు. ఎంతకూ రాక పోవడంతో తన కూతురుతో కలిసి సొంత కారులో గెస్ట్ హౌస్ వరకు వెళ్లిపోయారు. అనంతరం కూతురు సుస్మిత పటేల్‌తో కలిసి పట్నం వేసి మంత్రి కొండా సురేఖ మొక్కులు తీర్చుకున్నారు.