డిసెంబర్ 29న కొమురెల్లి మల్లన్న కల్యాణం.. జనవరి నుంచి 10 ఆదివారాలు జాతర

డిసెంబర్ 29న కొమురెల్లి మల్లన్న కల్యాణం.. జనవరి నుంచి 10 ఆదివారాలు జాతర
  • 29న కొమురెల్లి మల్లన్న కల్యాణం
  • అధికారులు సమన్వయంతో జాతరను సక్సెస్ చేయాలి: మంత్రి కొండా సురేఖ
  • జనవరి నుంచి 10 ఆదివారాలు జాతర  
  • భక్తులకు అన్ని సౌలత్​లు కల్పించాలని మంత్రి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను  తెలంగాణ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. గురువారం సెక్రటేరియెట్ నుంచి సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మల్లన్న జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఈ నెల 29న ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామివారి కల్యాణం, వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 10 ఆదివారాలపాటు (మార్చి 23 వరకు) జాతర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని కోరారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఈవోను మంత్రి ఆదేశించారు. ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు సమర్పించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానుండడంతో అందుకు తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేయాలని సిద్దిపేట డిపో మేనేజర్ కు సూచించారు.

ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
స్వామివారి కల్యాణం, జాతర ను జనంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. జాతర రోజుల్లో సాయంత్రం వేళల్లో కళాబృందాలతో ఒగ్గుకథ, జానపద కళారూపాలు ప్రదర్శించేలా సాంస్కృతికశాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. కల్యాణంతోపాటు జాతర జరిగినన్ని రోజులు ఆలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబ్​ చేయాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

కల్యాణోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆహ్వానించనున్నట్టు మంత్రులు తెలిపారు. అలాగే, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కిరీటాల తయారీ పనులపైనా మంత్రులు ఆరా తీశారు. రూ.9.776 కోట్లు ఎస్​డీఎఫ్ నిధులు, రూ.36.18 కోట్ల దేవాదాయశాఖ నిధులతో చేపడుతున్న పనులను ఈవో మంత్రికి వివరించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.