యాదగిరిగుట్ట, వెలుగు : వేద మంత్రాల సాక్షిగా, మేళ తాళాల తోడుగా, భక్తుల జయజయ ధ్వానాల నడుమ.. నారసింహుడు, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో కమనీయంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గజవాహనంపై ఊరేగింపుగా.. కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఎదురెదురుగా అధిష్ఠింపజేసి..
పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతుల్లో కల్యాణాన్ని జరిపారు.అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యా ణంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల దంపతులు, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 9 గంటలకు నారసింహుడు శ్రీరామచంద్రుడి అలంకారంలో హనుమంత వాహనంపై ఆలయ తిరువీధుల్లో విహరించాడు. అనంతరం ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట రామావతార అలంకార సేవ నిర్వహించారు. కాగా, బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేశాయి.