దంబుల్లా: బ్యాటింగ్‌లో రాణించిన శ్రీలంక, బంగ్లాదేశ్.. విమెన్స్ ఆసియా కప్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన గ్రూప్–బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక 10 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. టాస్ నెగ్గిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 93/7 స్కోరు చేసింది. నానాపట్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. కావిషా రెండు వికెట్లు తీసింది.
తర్వాత లంక 11.3 ఓవర్లలో 94/0 స్కోరు చేసి నెగ్గింది. విష్మీ గుణరత్నే (39 నాటౌట్), చామరి ఆటపట్టు (49 నాటౌట్) దూకుడుగా ఆడారు. చామరికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 114 రన్స్ తేడాతో మలేసియాను ఓడించింది. ముందుగా బంగ్లా 20 ఓవర్లలో 191/2 స్కోరు చేసింది. ముర్షిద్ ఖాతున్ (80), నిగర్ సుల్తానా (62 నాటౌట్), దిలారా అక్తర్ (33) రాణించారు. తర్వాత మలేసియా 20 ఓవర్లలో 77/8 స్కోరుకే పరిమితమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఇండియాతో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడతాయి.