కొలంబో : ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక మంగళవారం సంచలన ప్రకటన చేసింది. దేశం దివాలా తీసిందని వెల్లడించింది. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు తీర్చలేమని లంక ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోవైపు దేశంలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. ఇంధన దొరకక జనం ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం గంటల తరబడి కరెంటు సరఫరా నిలిపేస్తుండటంతో ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1948 తర్వాత శ్రీలంక ఇంత దారుణ పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండటంతో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి బౌద్ధ గురువులు మద్దుతు పలుకుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని శ్రీలంక ప్రధాని మహింద్రా రాజపక్సే ప్రకటించారు. కొవిడ్ 19 కారణంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయని, ప్రజలు ఆందోళనలు విరమించి వెనక్కి వెళ్లాలని కోరారు.