కొలంబో: ఆసియా కప్ ఫైనల్ రేసు నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. సూపర్4 రౌండ్ తొలి పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లా తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది. మరోవైపు సూపర్4 రౌండ్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. అద్భుత బౌలింగ్‌తో చిన్న టార్గెట్‌ను కాపాడుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లంక 21 రన్స్ తేడాతో బంగ్లాను ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 50 ఓవర్లలో 257/9 స్కోరు చేసింది. సదీర సమరవిక్రమ (72 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 93) సత్తా చాటాడు. కుశాల్ మెండిస్ (50), పాథుమ్ నిశాంక (40) కూడా రాణించారు. ఓపెనర్ దిముత్ కరుణరత్నె (18) ఆరో ఓవర్లోనే ఔటైనా నిశాంకతో కుశాల్ మెండిస్ రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించాడు. అయితే కుశాల్‌తో పాటు చరిత్ అసలంక (10), ధనంజయ డిసిల్వ (6) వెంటవెంటనే ఔటవడంతో లంక 164/5తో నిలిచింది. ఈ దశలో సదీర.. కెప్టెన్ షనక (24)తో ఆరో వికెట్‌కు 60 రన్స్ జోడించడంతో లంక కోలుకుంది.
కానీ, మరోసారి విజృంభించిన బంగ్లా బౌలర్లు లోయర్ ఆర్డర్ బ్యాటర్ల పని పట్టారు. దాంతో, ఆతిథ్య జట్టు కష్టంగా 250 రన్స్ మార్కును దాటింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మూద్ చెరో మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం సాధారణ టార్గెట్ ఛేజింగ్‌లో తడబడిన బంగ్లా 48.1 ఓవర్లలో 236 రన్స్‌కు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (82) పోరాడినా మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. బర్త్‌డే బాయ్ కెప్టెన్ షనక, మహేశ్ తీక్షణ, పతిరణ తలో మూడు వికెట్లతో మెప్పించారు.
షనక దెబ్బకు ఓపెనర్లు నైమ్ (21), మెహిదీ మిరాజ్ (28), స్టార్టింగ్‌లోనే వెనుదిరగ్గా.. కెప్టెన్ షకీబ్ (3), లిటన్ దాస్ (15) నిరాశ పరిచారు. హృదయ్‌కి తోడు కాసేపు ప్రతిఘటించిన ముష్ఫికర్ రహీమ్ (29)ను కూడా ఔట్ చేసిన షనక బంగ్లాను మరోసారి దెబ్బకొట్టాడు. చివర్లో తీక్షణ, పతిరణ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన బంగ్లా కుప్పకూలింది. సదీరకు ప్లేయర్ ఆఫ్ అవార్డు లభించింది.