ENG v SL 2024: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఇంగ్లీష్ బ్యాటర్

ENG v SL 2024: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఇంగ్లీష్ బ్యాటర్

ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది. ఈ సిరీస్ కు ముందు శ్రీలంక క్రికెట్ మాజీ ఇంగ్లిష్ బ్యాటర్ ఇయాన్ బెల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు మంగళవారం (ఆగస్ట్ 13) ప్రకటించింది. బెల్ ఆగస్ట్ 16న జట్టుతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తాడని సిరీస్ ముగిసే వరకు ట్రావెలింగ్ స్క్వాడ్‌తో ఉంటాడని లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ లో సిరీస్ ఆడుతూ మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ ను కోచ్ గా నియమించడం లంక జట్టుకు కలిసి రానుంది.   

శ్రీలంక క్రికెట్ CEO యాష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ లోని పరిస్థితులపై అవగాహాన ఉన్న బెల్ ను కోచ్ గా  నియమించడం ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది. ఇయాన్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది. అతని సూచనలు ఈ కీలక పర్యటనలో మా జట్టుకు సహాయపడుతుంది". అని డిసిల్వా అన్నాడు. ఇంగ్లాండ్ తరపున 118 టెస్టులు ఆడిన బెల్.. 42.69 సగటుతో 7,727 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. 

తొలి టెస్టు ఆగస్టు 21న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానుంది. భారత్‌పై 27 ఏళ్ల తర్వాత 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న శ్రీలంక ఫుల్ జోష్ లో ఉంది. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమవ్వడం ఇంగ్లీష్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.