Sri Lanka Cricket: ఇలాంటి ఐడియాలు శ్రీలంకకే సొంతం: కన్సల్టెంట్ కోచ్‌గా సఫారీ ప్లేయర్

Sri Lanka Cricket: ఇలాంటి ఐడియాలు శ్రీలంకకే సొంతం: కన్సల్టెంట్ కోచ్‌గా సఫారీ ప్లేయర్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో శ్రీలంక కూడా రేస్ ఉంది. 55.56 విజయ శాతంతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికాతో కీలకమైన టెస్ట్ సిరీస్ కు సిద్దమవుతుంది. సౌతాఫ్రికాలో పర్యటించనున్న శ్రీలంక.. అక్కడ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ కు ముందు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ నీల్ మెకెంజీని శ్రీలంక క్రికెట్.. ఆ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా నియమించింది.

సౌతాఫ్రికాలో సిరీస్ జరగనుండడంతో మెకంజీ విలువైన సలహాలు శ్రీలంకకు కలిసి వస్తాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనూ శ్రీలంక క్రికెట్ ఇయాన్ బెల్ ను తన బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంది. ఈ సిరీస్ లో మూడో టెస్ట్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు ఇంగ్లీష్ మాజీ ప్లేయర్ బెల్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్న లంక.. సౌతాఫ్రికాతో సిరీస్ కు ఆ దేశ మాజీ ప్లేయర్ మెకంజీని నియమించుకోవడం విశేషం. 

48 ఏళ్ల మెకెంజీ దక్షిణాఫ్రికా తరఫున 58 టెస్టులు, 64 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను 37.39 సగటుతో 3200కు పైగా  పరుగులు చేశాడు. టెస్టు సిరీస్ లో భాగంగా నవంబర్ 27న కింగ్స్‌మీడ్‌లో తొలి టెస్ట్ జరుగతుంది. రెండో టెస్టు డిసెంబర్ 5 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది. ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్ పై 2-0 తో టెస్ట్ సిరీస్ గెలిచిన శ్రీలంక.. ఈ సిరీస్ లోనూ గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరువవుతుంది.