T20 World Cup 2024: మా ఆటగాళ్లు మంచోళ్లు.. మందు తాగలే: శ్రీలంక క్రికెట్ బోర్డు

T20 World Cup 2024: మా ఆటగాళ్లు మంచోళ్లు.. మందు తాగలే: శ్రీలంక క్రికెట్ బోర్డు

టీ20 ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌కు ముందు శ్రీలంక జట్టు సభ్యులు మద్యం సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంక క్రికెట్ జట్టు బసచేసిన హోటల్‌లో పలువురు ఆటగాళ్లు, అధికారులు ప్రీ మ్యాచ్ డ్రింక్ పార్టీ చేసుకుంటున్నట్లు జూలై 7న వార్తాపత్రికలు కథనాన్ని ప్రచురించాయి. ఈ ఆరోపణలు గప్పుమనగా.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఎస్ఎల్‌సీ వివరణ ఇచ్చుకుంది. తమ ఆటగాళ్లు చాలా మంచోళ్లని.. వారిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది.

ఐదుగురు క్రికెటర్లు.. 

డ్రింక్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు టాఫార్డర్ బ్యాటర్లు, ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఆల్ రౌండర్లు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. హోటల్ రూమ్‌లో అర్థరాత్రి వరకూ మద్యం సేవిస్తూ, చిందేశారని మీడియా నివేదించింది. ఈ పార్టీలో కొత్తగా నియమించబడిన అసిస్టెంట్ కోచ్, ఒక ఆటగాడి మేనేజర్ భాగమయ్యారని ఆరోపించింది. టీమ్ హోటల్‌లో ప్లేయర్ మేనేజర్ ఉండటంపై కథనం ఆందోళనలు లేవనెత్తింది. 

ఈ వార్తా కథనాలపై స్పందించిన లంక క్రికెట్ బోర్డు అవన్నీ అవాస్తవం, కల్పితమని పేర్కొంది. "వార్తా నివేదిక పూర్తిగా అబద్ధం, కల్పితం, నిరాధారమైనది.." అని SLC వివరణ ఇచ్చుకుంది. ఇటువంటి తప్పుడు రిపోర్టింగ్ శ్రీలంక క్రికెట్, సంబంధిత అధికారులు, ఆటగాళ్ల ప్రతిష్టను అన్యాయంగా దెబ్బతీస్తుందని ఉద్ఘాటించింది.

కాగా, లంకేయులు టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్నారు. అదీ నెదర్లాండ్స్‌పై.. ఎన్నో అంచలనాలతో మెగా టోర్నీ ప్రారంభానికి 15 రోజులు ముందే అమెరికా గడ్డపై అడుగుపెట్టిన లంక జట్టు తీరా టోర్నీ ప్రారంభమయ్యాక తడబడింది. గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్ల తర్వాత మూడో స్థానానికి పరిమితమైంది.