ప్రభుత్వ జోక్యం.. శ్రీలంక క్రికెట్‌ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

ప్రభుత్వ జోక్యం.. శ్రీలంక క్రికెట్‌ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

వరుస ఓటములతో తలెత్తుకోలేక పోతున్న శ్రీలంక జట్టుకు మరో షాకింగ్ వార్త ఇది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటన చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకూ లంకేయులు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనలేరు.

వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు పాలకమండలిని తొలగించాలని శ్రీలంక ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం చోటుచేసుకున్న  గంటల వ్యవధిలోనే ఐసీసీ సస్పెన్షన్ విధించడం గమనార్హం. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం కారణంగానే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

పేలవ ఆటతీరు

కుమార సంగార్కర, మహేళ జయవర్ధనే, లసిత్ మలింగ, తిలకరత్నే దిల్షాన్ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించాక లంక జట్టు మనుగడ కోల్పో తోంది. గత ఐసీసీ టోర్నీల్లో మంచి ప్రదర్శనే ఉన్నా.. ఈ ఏడాది మాత్రం లంకేయులు దారుణంగా విపలమయ్యారు. కనీసం నెదర్లాండ్స్, అఫ్ఘనిస్తాన్ జట్లు చూపిన పోరాటపటిమను కూడా చూపలేదు. 9 మ్యాచుల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించారు.