శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు.పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గెజిట్ విడుదల చేశారు.ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ మరునాడే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో ఆరు గంటల కర్ఫ్యూ విధించింది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు అధికారులు.
శ్రీలంకలో 22 మిలియన్ల జనాభా ఉన్నారు. 1948 నుంచి బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అందుకే ప్రజలు అర్థరాత్రి కూడా ప్లకార్డులు, కాగడాలు పట్టుకుని రోడ్డుపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.