- 83 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా) : టీ20 వరల్డ్ కప్‌ను మాజీ చాంపియన్ శ్రీలంక విజయంతో ముగించింది. మెగా టోర్నీలో సూపర్8 రౌండ్ చేరుకోలేకపోయిన లంక సోమవారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో 83 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. సూపర్–8 రౌండ్‌పై ఆశలు పెట్టుకున్న డచ్ టీమ్‌ను దెబ్బకొట్టింది. మరో మ్యాచ్‌లో నేపాల్‌పై బంగ్లాదేశ్ గెలవడంతో నెదర్లాండ్స్ ఇంటిదారి పట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లంక తొలుత 20 ఓవర్లలో 201/6 భారీ స్కోరు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (0), కమిందు మెండిస్ (17)
నిరాశ పరిచినా మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ (29 బాల్స్‌లో 5 ఫోర్లతో 46), చరిత్ అలసంక (21 బాల్స్‌లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 46), ధనంజయ డిసిల్వ (26 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించారు. చివర్లో ఏంజెలో మాథ్యూస్ (15 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 నాటౌట్), కెప్టెన్ వానిందు హసరంగ (6 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. డచ్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 రన్స్‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (31), మిచెల్ లెవిట్ (31) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. లంక బౌలర్లలో నువాన్ తుషార మూడు, మతీష పతిరణ, వానిందు హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.