IND vs SL: ఆఖరి వన్డేలోనూ ఓటమి.. పాతికేళ్ల నాటి పగ తీర్చుకున్న లంక

IND vs SL: ఆఖరి వన్డేలోనూ ఓటమి.. పాతికేళ్ల నాటి పగ తీర్చుకున్న లంక

శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. టీ20 సిరీస్‌ను 3-0తో టీమిండియా చేజిక్కించుకోగా.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో ఆతిథ్య లంక తమ వశం చేసుకుంది. ఈ ఇరు జట్ల మధ్య బుధవారం(ఆగష్టు 07) జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (96; 102 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పథుమ్ నిశాంక (45; 65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (59; 82 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులతో రాణించారు. 

26.2 ఓవర్లలో ఆలౌట్

అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టు 26.2 ఓవర్లలో 138 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్(30; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా భారత బ్యాటర్లెవరూ కనీస పోరాటం చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ(35; 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌) ఎప్పటిలానే కాసేపు మెరుపులు మెరిపించాడు. శుభ్ మన్ గిల్(6), విరాట్ కోహ్లీ(20), రిషభ్ పంత్(6), శ్రేయాస్ అయ్యర్(8), రియాన్ పరాగ్(15), శివం దూబే(9).. ఇలా భారత స్టార్లందరూ విఫలమయ్యారు. 

25 ఏళ్ల నిరీక్షణకు తెర

ఈ విజయంతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆతిథ్య జట్టు.. 25 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. శ్రీలంక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో చివరిసారి టీమిండియాను 1997లో ఓడించింది. ఆనాటి నుంచి సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న లంక.. ఎట్టకేలకు ఆ విజయాన్ని అందుకుంది. దాంతో, ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు.