గతాన్ని మర్చిపోని లంకేయులు.. బంగ్లా ఆటగాళ్లను అవమానించేలా చర్యలు

గతాన్ని మర్చిపోని లంకేయులు.. బంగ్లా ఆటగాళ్లను అవమానించేలా చర్యలు

2023 వన్డే ప్రపంచ కప్‌‌లో శ్రీలంక- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేయాల్సిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో బంగ్లా ఫీల్డర్లు 'టైమ్ ఔట్' రూల్ ప్రకారం అప్పీల్ చేశారు. నిర్ణయాన్ని సమీక్షించిన థర్డ్ అంపైర్ ఐసీసీ నిబంధనల ప్రకారం ఔట్‌‌గా ప్రకటించారు. తన ఔట్ నిర్ణయంపై మాథ్యూస్.. అప్పటి బంగ్లా సారథి షకీబ్ ఆల్ హసన్‌ను ప్రాథేయపడినా అతడు కరుణించలేదు. దీంతో ఆ వివాదం ఆయా దేశాల క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. బంగ్లా ఆటగాళ్లు.. శ్రీలంకపర్యటనకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ ఘటనను లంక జట్టు ఇప్పటికీ మరిచిపోలేదు. 

బంగ్లా పర్యటనలో లంకేయులు

3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కోసం లంక క్రికెట్ జట్టు.. బంగ్లాదేశ్‌‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ పూర్తవ్వగా.. 2-1 తేడాతో లంక టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. శనివారం(మార్చి 9) జరిగిన ఆఖరి టీ20లో 28 పరుగుల తేడాతో విజయం సాధించిన లంకేయులు సిరీస్ సొంతం చేసుకున్నారు. అయితే, ట్రోఫీ అందుకునే సమయంలో లంక టీమ్ 'టైమ్ ఔట్' సంజ్ఞలతో బంగ్లా ఆటగాళ్లను అవమానించారు. ఐసీసీ నిబంధనల్లో 'టైమ్ ఔట్' వంటి రూల్స్ ఇంకేమైనా ఉన్నాయేమో పరిశీలించండి.. అప్పుడే మీరు గెలవగలరు.. అనేలా వ్యవహరించారు.

ఉన్మాదంలో ఉన్నారు

లంక టీమ్ వ్యవహరించిన 'టైమ్ ఔట్' సంజ్ఞలపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్పందించారు. పాత ఘటనలు మర్చిపోయి, భవిష్యత్ గురించి ఆలోచించాలని శ్రీలంకకు సూచించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని తెలిపారు. లంక ఆటగాళ్లు ఉన్మాదంలో ఉన్నారని, దాని నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని తాను ఆశిస్తున్నాట్లు శాంటో విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు.

also read : మూడు ఫార్మాట్లలో టీమిండియా నంబర్ -1