ద్వీప దేశం.. దివాళా

ద్వీప దేశం.. దివాళా

ఆసియా ఖండంలోనే సుందర ద్వీపదేశంగా ప్రసిద్ధికెక్కిన దేశం శ్రీలంక ఇప్పుడు ఆహార, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. సాయం చేసే చెయ్యి కోసం ఎదురుచూస్తోంది. 26 ఏండ్ల పాటు ఎల్టీటీఈతో అంతర్యుద్ధం వల్ల వచ్చిన సంక్షోభాలను దాటి ఎదుగుతున్న క్రమంలోనే కరోనా వైరస్​ మహమ్మారి, పాలకుల అనాలోచిత విధానాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పతనం అంచున నిలబెట్టాయి. ఆహార కొరత, అప్పులు, పడిపోయిన విదేశీ మారక నిల్వలు శ్రీలంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. పాలు, బియ్యం, గ్యాస్​, గుడ్లు, చికెన్​, పంచదార, కిరోసిన్​ లాంటి ధరలు భారీగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతానికి ఎగబాకింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,586 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినా పరిస్థితులు అదుపులోకి రాక.. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

కరోనాతో కుదేలు

శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. ప్రపంచంలో టాప్​ టెన్​ పర్యాటక దేశాల్లో శ్రీలంక ఒకటి. ఆ దేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10 శాతం. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో విదేశీ కరెన్సీ కూడా వచ్చేది. కరోనా మహమ్మారి వల్ల ఆ దేశ పర్యాటక రంగంపై పెను ప్రభావమే పడింది. దీంతో ఆదేశ పర్యాటక రంగ ఆదాయం పడిపోయింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. మామూలు సమయాల్లో ఏటా 360 కోట్ల డాలర్లు పర్యాటకం ద్వారా శ్రీలంక సంపాదిస్తే.. కరోనా కారణంగా అది 60 కోట్ల డాలర్లకు పడిపోయింది. దాంతో పాటు ఆ రంగంపైనే ఆధారపడి బతుకుతున్న 30 లక్షల మంది ఉపాధి పోయింది. దీంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. ఇటు 2019లో ఈస్టర్​ పండుగ నాడు మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో జరిగిన పేలుళ్లూ ఆ దేశ పర్యాటక రంగంపై దెబ్బకొట్టాయి. ఆ పేలుళ్లలో 45 మంది విదేశీ టూరిస్టులు సహా 269 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. దాని వల్ల కూడా పర్యాటక రంగంమీద దెబ్బపడినట్టయింది.  

ప్రభుత్వంలో నలుగురు రాజపక్సే సోదరుల హవా

2007లో శ్రీలంక అధ్యక్షుడిగా మహేంద్ర రాజపక్సే బాధ్యతలు చేపట్టారు. ఎల్టీటీఈని అణచివేసేందుకు కఠినమైన చర్యలు తీసుకున్నారు. 2009లో చేసిన మిలటరీ ఆపరేషన్​లో ఎల్టీటీఈ చీఫ్​ వేలుపిళ్లై ప్రభాకరన్​ చనిపోయాడు. దేశంలో అంతర్యుద్ధానికి తెరపడింది. అయితే, ఆ తర్వాత అధ్యక్షుడిగా రాజపక్సే తీసుకునే నిర్ణయాలకు ఎదురంటూ లేకుండా పోయింది. ఆయన తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ప్రస్తుతం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయన్న ఆరోపణలూ ఉన్నాయి. 2015లో రాజపక్సే ఓడిపోయి మైత్రిపాల సిరిసేన అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా.. రాజపక్సే నిర్ణయాలను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. 2019లో రాజపక్సే సోదరుడు గోటబయ రాజపక్సే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో దేశ ప్రధానిగా మహీంద్ర రాజపక్సే మళ్లీ అధికారంలోకి వచ్చేశారు. దేశ ఆర్థిక మంత్రిగా బాసిల్​ రాజపక్సే, మరొక సోదరుడు చమాల్​ జయంత్ రాజపక్సే అంతర్గత భద్రత, నీటిపారుదల శాఖ మంత్రిగా కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఆ నలుగురు రాజపక్సే సోదరులు తీసుకున్న నిర్ణయాలు, బంధుప్రీతి, అవినీతి సహా శ్రీలంక సంక్షోభానికి కారణాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజపక్సేలు పన్నులను తగ్గించడం వంటి హామీల వల్ల కూడా ఆ దేశ ఆదాయం పడిపోవడానికి కారణమైంది. దీంతో కరెన్సీని 42 శాతం ఎక్కువగా ముద్రించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయి ఆర్థిక సంక్షోభం ముదిరింది. ఇటు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎరువులు నాణ్యంగా ఉండకపోవడంతో వేరే దేశాలవైపు శ్రీలంక చూసింది. అయితే, ఆయా దేశాల నుంచి ఎరువుల దిగుమతికి సరిపడా డాలర్లు లేకపోవడంతో 100 శాతం సేంద్రియ వ్యవసాయంవైపు ఆ దేశం అడుగులు వేసింది. దీంతో సాగుతో పాటు దిగుబడులపైనా ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించింది. సేంద్రియ సాగుకు రైతులను ముందే సిద్ధం చేయకపోవడం, రసాయన ఎరువులను వాడకపోవడం వంటి కారణాలతో దిగుబడి సగానికిపడిపోయింది. ప్రధాన పంట అయిన తేయాకు ఉత్పత్తి 50 శాతం తగ్గిపోయింది. వేరే దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోవడానికి డాలర్లు లేక ఆహార సంక్షోభం ఏర్పడింది. కుటుంబ పాలనతో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఆ దేశం ఆగమైపోయింది.  

హ్యాండిచ్చిన డ్రాగన్

శ్రీలంకలో ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు కేవలం 150 కోట్ల డాలర్లే ఉన్నాయి. దీంతో నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి, అప్పులు తీర్చడానికి ఆ దేశం నానా తంటాలు పడుతోంది. బండారునాయకే, జయవర్ధనే, ప్రేమదాస, చంద్రిక కుమార తుంగలు ఇండియాతో ఎన్నో ఏండ్ల పాటు సత్సంబంధాలను కొనసాగించినా.. రాజపక్సే అధికారంలోకి వచ్చాక చైనాతో అంటకాగారు. ఆ దేశం నుంచి దాదాపు 350 కోట్ల డాలర్ల అప్పులు తీసుకున్నారు. ఆ రుణాలను మళ్లీ తిరిగి చెల్లించలేని స్థాయికి శ్రీలంక దిగజారిపోయింది. ఇండియాకు సరిహద్దులుగా ఉన్న నేపాల్​, పాకిస్తాన్​, శ్రీలంక వంటి దేశాలకు అప్పులిచ్చి.. వాటిని తన గుప్పిట్లో పెట్టుకుని మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలన్న చైనా కుట్రలు అక్కడ ఫలించాయి. అందులో భాగంగానే శ్రీలంక అప్పులు తీర్చలేకపోవడంతో అత్యంత కీలకమైన హంబన్​టోట పోర్టును 99 ఏండ్ల కాలానికిగానూ 70 శాతం కంట్రోల్​తో చైనా లీజుకు తీసుకుంది. వాస్తవానికి ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకకు కనీస సాయం చేయాలనీ చైనా భావించలేదు. శ్రీలంక వేడుకున్నా ఎలాంటి ప్రకటనా చేయలేదు. శ్రీలంక పర్యటనలోనే ఉన్న చైనా విదేశాంగ మంత్రి సంక్షోభ పరిష్కారం కోసం సాయం చేసే విషయంపై ఏమీ మాట్లాడలేదు. అయితే, ఇండియా మాత్రం సాయం చేస్తామంటూ శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్​ రాజపక్సేకి హామీనిచ్చింది. ఇప్పటికే ఆహారం, మందులను అందించిన ఇండియా.. ఆర్థిక తోడ్పాటుకూ ముందుకొచ్చింది. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోని డ్రాగన్​ కపట నీతిని శ్రీలంక ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనాతో పాటు పాలకుల అనాలోచిత నిర్ణయాలతో సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకను కాపాడాల్సిన బాధ్యత ధనిక దేశాలతో పాటు సరిహద్దు దేశాలపైనా ఉందన్న విషయాన్ని మరచిపోవద్దు. జింబాబ్వే, వెనిజులా, సోమాలియాల్లాగా శ్రీలంక కూడా మారిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. కన్నీటి బొట్టు ఆకారంలో ఉన్న శ్రీలంకకు కన్నీళ్లు మిగలకుండా ప్రపంచం చేయూతనివ్వాలి. 

10 గంటలు కరెంట్​ కట్​

ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం గంటల కొద్దీ కరెంట్​ కోతలు, జబ్బులను తగ్గించే మందులూ అందనంత స్థాయిలో ఉంది. విద్యుత్​ ఉత్పత్తికి అవసరమైన డీజిల్​ కొరత ఏర్పడడంతో.. అవసరమైన స్థాయిలో కరెంట్​ ఉత్పత్తి కావట్లేదు. దీంతో రోజూ 10 గంటల పాటు కరెంట్​ను కోసేస్తున్నారు. డిమాండ్​కు తగినట్టు పవర్​ ఉత్పత్తి కావట్లేదని, కోతలు తప్ప వేరే దారి లేదని సీలన్​ ఎలక్ట్రిసిటీ బోర్డ్​ ప్రకటించింది. ప్రస్తుతం సాయంత్రం కాగానే వెలుగులీనే వీధి దీపాలు చీకట్లలో మగ్గిపోతున్నాయి. కరెంట్​ కోతల వల్ల రెస్టారెంట్లు, దానిమీద ఆధారపడే చిన్నచిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని షాపులు కొవ్వొత్తి వెలుగుల్లోనే నడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడే ఔషధాలకూ కొరత ఏర్పడినట్టు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రష్యా – ఉక్రెయిన్​ యుద్ధం ఎఫెక్ట్​

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం వల్ల కూడా శ్రీలంకకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. శ్రీలంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యా, ఉక్రెయిన్​కు చెందిన వాళ్లే 25 శాతం దాకా ఉంటారు. యుద్ధంతో ఆ దేశాల నుంచి టూరిస్టులూ రావట్లేదు. దానికి తోడు శ్రీలంకలో పండే తేయాకును రష్యా, ఉక్రెయిన్​, బెలారస్​లు ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటాయి. రష్యా, ఉక్రెయిన్​ నుంచి లంక ముడి చమురు, గ్యాస్​ను దిగుమతి చేసుకుంటుంది. అయితే, యుద్ధం ప్రభావంతో శ్రీలంక ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ముడి చమురు రాక పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​, కిరోసిన్​లకు కొరత ఏర్పడింది. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. దీంతో పెట్రోల్​ బంకుల వద్ద సైన్యాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

:: డాక్టర్​ తిరునాహరి శేషు, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, కాకతీయ యూనివర్సిటీ