అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెన్వెస్ పార్క్‌లో చివరి మూడో వన్డే మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు.. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 301 పరుగుల భారీ స్కోర సాధించింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ట్(184 నాటౌట్, 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్సులు) భారీ అజేయ శతకంతో చెలరేగింది.
అనంతరం 302 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసి రికార్డు విజయాన్ని అందుకుంది. ఓపెనర్ చమరి అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు చరిత్రలో నిలచిపోయే విజయాన్ని అందించింది. ఆమె కేవలం 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సులతో 195 పరుగులు చేసింది. దీంతో మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసింది శ్రీలంక. గతంలో నార్త్ సిడ్నీ ఓవల్‌లో 289 పరుగులను ఛేదించిన ఆస్ట్రేలియా.. వన్డేల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది శ్రీలంక.
కాగా, 34 ఏళ్ల స్టార్ బ్యాటర్ చమరి ఆటపట్టుకు ఇది ODIలలో మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017, జూన్ 29న బ్రిస్టల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆటపట్టు(178) అజేయ శతకం సాధించింది.