టీమిండియా స్పిన్ ముందు మరోసారి తలవంచారు. స్పిన్నర్లకు తలవంచుతూ శ్రీలంక చేతిలో 0-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయారు. 3 మ్యాచ్ ల సిరీస్ లో అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ ఆలౌటైంది. లంక స్పిన్నర్ల ధాటికి డిఫెన్స్ చేయలేక.. అటాకింగ్ చేయలేక చేతులెత్తేశారు. 30 వికెట్లతో 27 వికెట్లను స్పిన్నర్లకు సమర్పించుకున్నారు. మిగిలిన మూడు వికెట్లలో అసిత ఫెర్నాండో కు రెండు వికెట్లు దక్కగా.. ఒకటి రనౌట్ రూపంలో వచ్చింది. హసరంగా, అసలంక, వెల్లలాగే, వాండర్సే, తీక్షణ భారత బ్యాటర్లను ఒక ఆటాడుకున్నారు.
తొలి వన్డేలో హసరంగా, అసలంక చెరో మూడు వికెట్లు తీశారు. రెండో వన్డేలో వాండర్సే ఏకంగా ఆరు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. మూడో వన్డేలో వెల్లలాగే 5 వికెట్లతో చెలరేగి టీమిండియాకు సిరీస్ దూరం చేశాడు. పార్ట్ టైమ్ బౌలర్ అసలంకకు సైతం భారత బ్యాటర్లు వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో ఒక చెత్త రికార్డ్ భారత్ ఖాతాలో చేరింది. మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ లో స్పిన్నర్లు 27 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అత్యధిక వికెట్లు స్పిన్నర్లకు సమర్పించుకున్న జట్టుగా రోహిత్ సేన నిలిచింది.
ఈ సిరీస్ విషయానికి వస్తే శ్రీలంక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా ముగిసిన తొలి మ్యాచ్ టై కాగా.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో లంక విజయాన్ని అందుకుంది. బుధవారం (ఆగస్ట్ 7) జరిగిన మూడో వన్డేలో లంకేయులు 110 రన్స్ తేడాతో టీమిండియాను చిత్తు చేశారు. ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, దునిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.