
భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం (ఆగస్ట్ 2) తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది టీమిండియాకు ఇదే తొలివన్డే కావడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పూర్తి స్థాయి భారత జట్టు ఈ సిరీస్ ఆడతుండడంతో ఈ సిరీస్ పై భారీ హైప్ నెలకొంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే కావడంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ భారత తుది జట్టు విషయానికి వస్తే ఎలా ఉండబోతుందో చూద్దాం.
తొలి వన్డే కావడంతో జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు రావడం లేదు. ఓపెనర్లుగా శుభమాన్ గిల్, రోహిత్ శర్మ రానున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. గిల్ తొలిసారిగా వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తారు. వికెట్ కీపర్ విషయంలో రాహుల్ లేదా పంత్ లలో ఒకరికే అవకాశం దక్కనుంది. సీనియర్ ప్లేయర్ గా రాహుల్ జట్టులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. ఆరో స్థానంలో ఆల్ రౌండర్ గా దూబే, పరాగ్ ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
శ్రీలంకతో జరిగిన సిరీస్ లో పరాగ్ స్పిన్ తో అదరగొట్టాడు. పార్ట్ బౌలర్ గా వచ్చి పూర్తి స్థాయి బౌలింగ్ చేస్తున్నాడు. పైగా యువ క్రికెటర్ కావడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పరాగ్ కు అవకాశం కల్పించవచ్చు. ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రానా భారత జట్టులో ఉంటారు. ఖలీల్ అహ్మద్ లేదా అర్షదీప్ సింగ్ లలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ జట్టులో కొనసాగుతాడు.