బులావయో (జింబాబ్వే): ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ బెర్తు దక్కించుకునేందుకు శ్రీలంక మరిత చేరువైంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో లంక విజయ యాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన లంక శుక్రవారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 21 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. మొదట ధనంజయ డిసిల్వ (93) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో లంక 213 రన్స్ వద్ద ఆలౌటైంది.
మిగతా బ్యాటర్లు ఫెయిలైనా.. కరుణరత్నె (33), మహేశ్ తీక్షణ (28) వానిందు హసరంగ (20) సపోర్ట్‌తో డిసిల్వ జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. డచ్ బౌలర్లలో డి లీడె, లోగాన్ వాన్ బీక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌కు వచ్చిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 రన్స్‌కే ఆలౌటై ఓడింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (67 నాటౌట్), వెస్లీ బరేసి (52), డి లీడె (41) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లంక బౌలర్లలో మహేశ్ తీక్షణ మూడు, హసరంగ రెండు వికెట్లతో డచ్ టీమ్‌ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం సూపర్ సిక్స్ దశలో లంక, జింబాబ్వే చెరో ఆరు పాయింట్లతో టాప్‌లో ఉన్నాయి. ఫైనల్ చేరిన జట్లు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతాయి.