లంకలో సంక్షోభం: ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశన్నంటుతుండటంతో సామాన్యులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ధరల్ని నియంత్రించలేకపోవడం, ప్రజల నిరసనలను తట్టుకోకపోవడంతో లంకలో ఎమర్జెన్సీ విధించారు. ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సను మినహాయించి కేబినెట్ లోని అందరు మంత్రులు రాజీనామాలు చేయడం గమనార్హం. రాజపక్స కూడా పదవి నుంచి తప్పుకుంటారనే రూమర్లు వస్తున్నాయి. దీనిపై శ్రీలంక ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. రాజపక్స రాజీనామా చేయలేదని పీఎం ఆఫీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా, దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రపతి గోటాబ్యా రాజపక్సను కలసి మహింద రాజపక్స చర్చించారు. ఈ మీటింగ్ లో పలు దేశంలో నెలకొన్న పరిస్థితులు, సంక్షోభం గురించి సమాలోచనలు చేసినట్లు సమాచారం. 

ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహింద తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ప్రధాని మహింద ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా ఆదివారం పౌరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు కలసి నిరసనలు వ్యక్తం చేయగా.. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్‌కోతలు, నిత్యావసరాల కొరత ఏర్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  

మరిన్ని వార్తల కోసం:

సెలవు రోజుల్లో వీఐపీ దర్శనాలు ఉండవ్

రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీల లెక్క కొలిక్కి