రూ. 1400 కోట్లు.. భారత్‌లో శ్రీలంక క్రికెట్ దిగ్గజం భారీ పెట్టుబడులు

రూ. 1400 కోట్లు.. భారత్‌లో శ్రీలంక క్రికెట్ దిగ్గజం భారీ పెట్టుబడులు

స్పిన్ మాంత్రికుడు, శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా, బదనగుప్పెలో 1400 కోట్ల పెట్టుబడితో బెవరేజ్‌ యూనిట్‌ (శీతల పానీయాల తయారీ కేంద్రం) స్థాపించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

శ్రీలంకలో శీతల పానీయాల వ్యాపారం నిర్వహిస్తున్న ఈ మాజీ క్రికెటర్ 'ముత్తయ్య బెవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్' బ్రాండ్‌తో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌తో విస్తరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ను కలుసుకుని తన వ్యాపార ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపారు. జనవరి 2025 నాటికి చామరాజనగర్ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. 

మొదట ఈ ప్రాజెక్ట్ రూ. 230 కోట్ల పెట్టుబడితో ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ మొత్తం రూ.1,000 కోట్లకు సవరించబడింది. మరికొన్నాళ్లలో దశల వారీగా రూ.1,400 కోట్లకు పెంచుతామని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 46 ఎకరాల భూమిని కేటాయించినట్లు పాటిల్ తెలిపారు. కేటాయించిన భూమికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.