
తమిళనాడు జాలర్లను వరుసగా అరెస్ట్ చేస్తోంది శ్రీలంక ఆర్మీ.. గత వారంలో 14 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక ఆర్మీ తాజాగా.. మరో 10 మంది జాలర్లను అరెస్ట్ చేసి, 3 బోట్లను సీజ్ చేసింది. ఇంటర్నేషనల్ మేరిటైం బార్డర్ లైన్ ( ఐఎంబీఎల్ ) దాటినందుకు తమిళనాడు జాలర్లను శ్రీలంక ఆర్మీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు తమిళనాడు కోస్టల్ పోలీసులు. శ్రీలంక ఆర్మీ అరెస్ట్ చేసిన జాలర్లను వెంటనే విడిపించాలని జాలర్ల కుటుంబసభ్యులు, జాలర్ల సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలను కోరుతున్నాయి. జాలర్ల వరుస అరెస్టులను ఖండిస్తూ గురువారం ( ఫిబ్రవరి 20 ) రామేశ్వరంలోని కోస్తా తీరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశాయి జాలర్ల సంఘాలు.
ఫిబ్రవరి నెలలోనే శ్రీలంక ఆర్మీ తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేయడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 3న 10మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక ఆర్మీ.. ఫిబ్రవరి 9న 14 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసి ఒక బోటును సీజ్ చేసింది. అంతే కాకుండా జనవరి 26న 34 మంది తమిళ జాలర్లను అరెస్ట్ చేసింది శ్రీలంక ఆర్మీ. శ్రీలంక ఆర్మీ వరుసగా తమిళ జాలర్లను అరెస్ట్ చేయడం పట్ల జాలర్ల సంఘాలు,కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీలంక ఆర్మీ అరెస్ట్ చేసిన తమిళనాడు జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు.జాలర్ల వరుస అరెస్టులతో ఆర్థిక పెరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు స్టాలిన్.