ఆస్పత్రుల్లో డాక్టర్, నర్సు డ్యూటీ చేస్తున్న సైన్యం

శ్రీలంకలోని కొలంబోలో హాస్పిటల్ ఆర్డర్లీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అలవెన్సులపై దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శ్రీలంక.. రోగులను చూసుకోవడంలో సహాయం చేయడానికి వందలాది మంది సైనికులను పలు ఆసుపత్రులకు పంపింది. శ్రీలంక ఏడు దశాబ్దాలుగా అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇది అక్కడి జీవన వ్యయాన్ని విపరీతంగా పెంచింది. పన్నులను పెంచడానికి, ప్రభుత్వ ఉద్యోగుల ప్రోత్సాహకాలను పరిమితం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆసుపత్రి డైరెక్టర్ల అభ్యర్థన మేరకు, 25 ఆసుపత్రులలో 615 మంది సైనికులు, 19 మంది అధికారులను మోహరించారని సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ రసిక కుమార చెప్పారు. ఇకపోతే హెల్త్‌కేర్ వర్కర్లు వలస వెళ్లడం, పబ్లిక్ హెల్త్‌కేర్ ఖర్చు తగ్గించడం, ఖర్చులు పెరగడంతో శ్రీలంకలోని పబ్లిక్ హెల్త్‌కేర్ సిస్టమ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

శ్రీలంక కేబినెట్ ఇటీవలే వైద్యులకు 70వేల రూపాయల (214డాలర్లు) నెలవారీ రవాణా భత్యాన్ని ఆమోదించింది. దీనికి ప్రతిస్పందించిన ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన.. హెల్త్ సర్వీసెస్ ట్రేడ్ యూనియన్ అలయన్స్ కన్వీనర్ రవి కుముదేశ్... ప్రభుత్వం వైద్యులకు ఉపశమనం ఇస్తోంది కానీ రోగులకు క్రిటికల్ కేర్ ఇవ్వడంలో భాగమైన ఇతర ఆసుపత్రి సిబ్బందిని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే వారు సమ్మెకు దిగారని చెప్పారు.