కొత్త ప్రెసిడెంట్​ వచ్చిండు.. కుదుటపడేనా శ్రీలంక?

తమిళ టైగర్ల చాప్టర్ ముగిసిపోయాక శ్రీలంక పేరు పెద్దగా వార్తల్లోకి రావడం లేదు. అక్కడ రాజకీయ పరిస్థితులు మారినప్పుడు మాత్రమే శ్రీలంక గురించి వింటున్నాం. ఏడాదిగా శ్రీలంకలో రాజకీయంగా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికలు ఈ పరిస్థితిని మారుస్తాయో లేదో చూడాలి. ప్రెసిడెంట్ గా ఎన్నికైన గోతబయ రాజపక్స దేశాన్ని ఎటు నడిపిస్తారో అనే ఆసక్తి నెలకొంది.

శ్రీలంకలో గత కొన్నేళ్లుగా పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. దేశంలో రాజకీయ స్థిరత్వం లేదు. కిందటేడాది ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన దేశ ప్రధానిని తొలగించి ఆ స్థానంలో మహీంద రాజపక్సను నియమించారు. దీంతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకేసారి దేశానికి ఇద్దరు ప్రధానులున్న అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. కొన్ని నెలల పాటు శ్రీలంకలో ఈ అయోమయం నెలకొంది. తరువాత మహీంద ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే గత ఏప్రిల్ నెలలో దేశంలోని చర్చ్ లను టార్గెట్ గా చేసుకుని జరిగిన బాంబు దాడుల్లో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 250 మంది చనిపోయారు. ఈ సంఘటనతో  ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ పై అదుపులేదన్న విమర్శలు వచ్చాయి. ప్రెసిడెంట్ గా ఉన్న మైత్రిపాల సిరిసేన ప్రజల్లో అన్ పాపులర్ అయ్యాడు.ఈ బ్యాక్ డ్రాప్ లో  ప్రెసిడెంట్ పోస్టుకు జరిగిన ఎన్నికలు కీలకంగా మారాయి.  దేశం ఎటు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పోస్టుకు ప్రతిపక్ష పార్టీ ‘శ్రీలంక పోడుజన పెరమున (ఎస్ ఎల్ పీపీ) తరఫున మహీంద తమ్ముడు గోతబయ రాజపక్స, ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ (యూఎన్పీ) తరఫున మాజీ ప్రెసిడెంట్ రణసింఘే ప్రేమదాస కొడుకు సాజిత్ ప్రేమదాస పోటీ చేశారు. సాజిత్ ప్రేమదాసతో పోలిస్తే  గోతబయకు ఎక్సలెంట్ ట్రాక్ రికార్డు ఉంది. డిఫెన్స్ సెక్రటరీగా ఆయన లీడర్ షిప్ క్వాలిటీస్ ప్రజలను ఆకట్టుకున్నాయి. అన్న మహీంద అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కూడా గోతబయ ట్రాక్ రికార్డు కు తోడయ్యాయి. దీంతో దేశాన్ని కొత్త బాటలోకి తీసుకువెళతారని గోతబయను శ్రీలంక ప్రజలు నమ్మారు. ప్రెసిడెంట్ గా గెలిపించారు.

సైన్యం నుంచి ఎదిగొచ్చిన లీడర్

ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టబోతున్న గోతబయ రాజపక్స సైన్యం నుంచి ఎదిగివచ్చిన నాయకుడు. ఆఫీసర్ గా ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చిన గోతబయ డిఫెన్స్ సెక్రటరీగా రిటైరయ్యారు. గోతబయ తండ్రి డీ ఏ రాజపక్స శ్రీలంక రాజకీయాల్లో ప్రముఖుడు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ ఫౌండర్లలో ఒకరు. ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించారు. గోతబయ 1971లో కేడెట్ ఆఫీసర్ గా శ్రీలంక సైన్యంలో చేరారు. సైన్యంలో అంచెలంచెలుగా పైకొచ్చారు. 1991లో సర్ జాన్  కొటెలావాలా డిఫెన్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్ గా అప్పాయింట్ అయ్యారు. 1992లో సైన్యం నుంచి రిటైరయ్యారు. 20 ఏళ్లపాటు సైన్యంలో అనేక కీలక పోస్టుల్లో ఆయన పనిచేసి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రిటైర్ అయిన తరువాత కొలంబో యూనివర్శిటీ నుంచి ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ లో పీజీ చేశారు.1998లో అమెరికా వెళ్లి లాస్ ఏంజలిస్ లోని ఒక ఐటీ కంపెనీలో  చేరారు. 2005 ఎన్నికల్లో అన్న  మహీంద రాజపక్స ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తుంటే ఎన్నికల ప్రచారంలో ఆయనకు సాయంగా ఉండేందుకు శ్రీలంక వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచి మహీంద రాజపక్స ప్రెసిడెంట్ అయ్యారు. అదే ఏడాది నవంబరులో తమ్ముడు గోతబయను డిఫెన్స్ సెక్రటరీగా తీసుకున్నారు. అప్పటికి ఎల్టీటీఈ   యాక్టివిటీస్ లంకలో చాలా ఎక్కువగా ఉండేవి. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడుస్తున్న ఎల్టీటీఈ అంతు చూడాలని అనుకుంటున్న గోతబయకు ఈ పదవి ఎంతో మంచి అవకాశం ఇచ్చింది. ఆర్మీలో పనిచేసిన అనుభవాన్నంతా ఉపయోగించుకుని ఎల్టీటీఈ వ్యూహాలను తలదన్నే ప్లాన్లు వేశారు. గోతబయ అద్భుత వ్యూహాల కారణంగానే 2009లో ఎల్టీటీఈ కి ఎండ్ కార్డ్ పడింది.

2005లో తొలిసారి ప్రెసిడెంట్ అయిన మహీంద

శ్రీలంక ఆరవ ప్రెసిడెంట్ అయిన మహీంద రాజపక్స లాయర్ గా జీవితం ప్రారంభించి ఆ తరువాత రాజకీయాల్లో చేరారు. 1970ల్లో తొలిసారి శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2004 ఏప్రిల్ 6న ప్రధాని అయ్యారు. తరువాత  2005 ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడయ్యారు. అప్పటికి దేశంలో ఎల్టీటీఈ కార్యకలాపాలు ఎక్కువగా నడుస్తుండేవి. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ అయిన మహీంద శ్రీలంక ఆర్థికంగా బలపడటానికి అనేక చర్యలు తీసుకున్నారు. టూరిజం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్  సెక్టార్ లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ సమయంలోనే సొంత జిల్లాలో హంబనొత్త పేరుతో ఒక ఓడరేవును నిర్మించారు. మహీంద ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆయన తమ్ముడు గోతబయ డిఫెన్స్ సెక్రటరీగా, మరో ఇద్దరు బ్రదర్స్​ స్పెషల్ అడ్వైజర్​గా, పోర్ట్స్ అండ్ ఏవియేషన్ మినిస్టర్​గా కీలక పదవుల్లో కొనసాగారు. ఒకే కుటుంబం నుంచి ఇంత మంది ఇన్ని  కీలక పదవుల్లో ఉండటాన్ని మహీంద ప్రత్యర్థులు ఇష్యూ చేశారు.సైన్యం సాయంతో 2009లో  శ్రీలంకలో కొన్నేళ్లుగా కొనసాగిన సివిల్ వార్ కు మహీంద ఫుల్ స్టాప్ పెట్టారు. 2010 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రెసిడెంట్ అయ్యారు.

‘వార్ హీరో’

‘వార్ హీరో’ గా సింహళీయుల నీరాజనాలు అందుకున్న గోతబయ రాజపక్స తమిళులకు విలన్. 2009లో ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై  ప్రభాకరన్ హత్య తరువాత తమిళ గెరిల్లాలను ఊచకోత కోసినట్లు రాజపక్స పై ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా గోతబయ అనేక తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడినట్లు తమిళులే కాకుండా మానవ హక్కుల సంస్థలు కూడా  ఆరోపించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు రాత్రికి రాత్రి మాయమయ్యేవారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా వారి ఆచూకీ తెలిసేది కాదు. ఇదంతా గోతబయ చేయించిందేనంటారు తమిళులు.

లంకలో ఐపీకేఎఫ్

శ్రీలంకలో పరిస్థితులు చక్కదిడ్డడంలో  ‘ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ’ (ఐపీకేఎఫ్) కీలక పాత్ర పోషించింది. 32 నెలల పాటు ఆ దేశంలో మకాం వేసి ఎల్టీటీఈ  యాక్టివిటీస్ కు ముకుతాడు వేసింది. తమిళ స్వతంత్ర ఈలం స్థాపనే ధ్యేయంగా శ్రీలంకలో అప్పటికే అనేక తమిళ గ్రూపులు పనిచేస్తుండేవి. ఒక దశలో  ఆ గ్రూపులన్నీ ఆయుధాలు వదిలేయడానికి రెడీ అయ్యాయి.  ప్రభాకరన్ నాయకత్వంలోని ఎల్టీటీఈ మాత్రం దీనికి అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో ఇండియా, శ్రీలంక దేశాల మధ్య 1987 లో ఒక ఒప్పందం కుదిరింది. దీంతో  ఎల్టీటీఈ కి చెక్ పెట్టడానికి, శాంతి స్థాపనకు ఐపీకేఎఫ్ దళాలు శ్రీలంకలోకి  ప్రవేశించాయి. 1987 నాటికి జాఫ్నా పూర్తిగా ఎల్టీటీఈ  ఆధీనంలో ఉండేది. ‘ఆపరేషన్ పవన్ ’. కోడ్ నేమ్ తో మూడు వారాల పాటు తమిళ గెరిల్లాలతో ఐపీకేఎఫ్ సేనలు హోరాహోరీ పోరాడి జాఫ్నాను  స్వాధీనపరచుకున్నాయి. 32 నెలల  పాటు లంకలోనే ఉంటూ ఇలాంటివే మరిన్ని ఆపరేషన్ లను ఐపీకేఎఫ్ చేపట్టి మంచి ఫలితాలను సాధించింది.

తమిళ ఈలమే లక్ష్యంగా ఎల్టీటీఈ

శ్రీలంకలో సింహళ భాష మాట్లాడేవాళ్లకు, తమిళ భాష మాట్లాడేవాళ్లకు మధ్య గొడవలు జరుగుతుండేవి. జాతుల సమస్య తీవ్రం కావడంతో  లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ( ఎల్టీటీఈ) పేరుతో  ఓ సంస్థను 1976 మే 5 వేలుపిళ్లై  ప్రభాకరన్ ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈలం ఏర్పాటు ఈ సంస్థ లక్ష్యం. ఎల్టీ టీఈ కార్యకర్తలు టైగర్లుగా పాపులర్. సూసైడ్ బాంబర్లకు ఈ సంస్థ  మరో పేరుగా మారింది. తమ డిమాండ్ల సాధన కోసం శ్రీలంక ప్రభుత్వంతో అనేక సార్లు ఎల్టీటీఈ చర్చలు జరిపింది. అయితే రకరకాల కారణాలతో ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో శాంతి  నెలకొల్పడం కోసం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకే ఎఫ్) పేరుతో రాజీవ్ గాంధీ హయాంలో ఇండియా తన  సైనిక బలగాలను పంపింది. రాజీవ్ చర్యను  ఎల్టీటీఈ  తీవ్రంగా  వ్యతిరేకించింది. సూసైడ్ బాంబు దాడితో   రాజీవ్ ను తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ  హత్య చేసింది. ఆ తర్వాత శ్రీలంక రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దీంతో ఎల్టీటీఈ  ప్రభావం తగ్గడం మొదలైంది. 2009 లో వేలుపిళ్లై  ప్రభాకరన్  హత్య తర్వాత ఎల్టీటీఈ  పూర్తిగా  తుడిచి పెట్టుకుపోయింది. శ్రీలంకలో  యుద్ధ పరిస్థితులు పోయి మామూలు వాతావరణం ఏర్పడింది.