
- వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
మహబూబ్నగర్ రూరల్, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ వేంకటేశ్వరుని రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వేలాది మంది భక్తుల మధ్య రథోత్సవం నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి గరుడ వాహన సేవ నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, రథంపైకి చేర్చారు.
పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జన సందోహంతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా రథాన్ని లాగారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.