భక్తులతో కిక్కిరిసిన వేములవాడ రాజన్న క్షేత్రం

వేములవాడ/కొమురవెల్లి, వెలుగు: సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. నాలుగు రోజుల్లో మహాజాతర మొదలవుతుండడంతో వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజామునే ధర్మగుండంలో స్నానం చేసి, ప్రత్యేక క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనం అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసాదం కౌంటర్లు, కళ్యాణకట్ట, క్యూలైన్లు భక్తులతో నిండిపోయి కనిపించాయి. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. ఆదివారం వేములవాడ రాజన్నను సంగారెడ్డి ఎస్పీ సి.రూపేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. అలాగే కొమురవెల్లి మల్లన్న జాతరకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.