
- ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతున్నదని వెల్లడి
- మంచిర్యాల జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే
కోల్బెల్ట్, వెలుగు: శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, సత్యానికి, న్యాయానికి, నీతివంతమైన జీవనానికి నిలువెత్తు రూపమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. భారతీయ సంస్కృతిలో శ్రీరాముడి జీవితం మార్గదర్శకమని పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు, జైపూర్, భీమారం మండలాల్లోని పలు రామాలయాలు, హనుమాన్ టెంపుల్స్‌లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొని, స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయాల అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, శ్రీరాముడు విలువలతో కూడిన రాజ్యపాలన చేశాడని చెప్పారు. అందుకే శ్రీరాముడు ఆదర్శ పురుషుడని, సీతారాములే ఈ లోకానికి ఆదర్శమూర్తులని పేర్కొన్నారు. వారి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో టాప్‌లో నిలబెడుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని అన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో 20 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
నియోజకవర్గంలోని ఆలయాల సందర్శన..
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని రామాలయాలను వివేక్ వెంకటస్వామి సందర్శించారు. మందమర్రిలోని మూడో జోన్, యాపల్, పాలచెట్టు, మారుతీనగర్, శివకేశవ ఆలయం, రామన్ కాలనీ, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమ్మ గార్డెన్స్, తిమ్మాపూర్ క్రాస్ రోడ్, రామకృష్ణాపూర్ కోదండ రామాలయం, అమరవాది హనుమాన్ టెంపుల్, జైపూర్ మండల కేంద్రం, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సీతారామచంద్ర ఆలయం, టేకుమట్ల, షేట్‌పల్లి, కుందారం, భీమారం మండల కేంద్రం, చెన్నూరులోని బేతాళవాడ, సుద్దాల తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో జరిగిన రాములవారి కల్యాణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంట స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ సీహెచ్ చిరంజీవి దంపతులు, జీఎం శ్రీనివాసులు, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూరు సీఐలు శశీధర్ రెడ్డి, వేణుచందర్, దేవేందర్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపల్ కమిషనర్లు గద్దె రాజు, తుంగపిండి రాజలింగు తదితరులు ఉన్నారు.