బంగారు సీతారామయ్య

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం స్వర్ణకవచాలు ధరించి బంగారు సీతారామయ్యగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. స్వర్ణకవచధారి రామయ్యను తిలకించిన భక్తులు పులకించిపోయారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ముత్తయిదువులకు మంజీరా(పసుపు ముద్ద)లు పంపిణీ చేశారు. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం జరిగింది.