రండి.. రాములోరి గుడి కడదాం!

రండి.. రాములోరి గుడి కడదాం!
ఇండియన్‌‌ హిస్టరీలో మరో సువర్ణ అధ్యాయం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. కోట్లాది ప్రజల కోరిక ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలవుతోంది. ఆయోధ్య రాముడి గుడి నిర్మాణంలో హిందువులందరినీ భాగం చేయాలనే తలంపుతో ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ మొదలు పెట్టింది. తెలంగాణలో ఈ నెల 20 (బుధవారం) ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతుంది. రాముడి ఆదర్శాలను ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నింపడంతో పాటు రామ జన్మభూమిలో నిలిచే మందిరం అందరిదీ అన్న భావన నెలకొల్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. రామజన్మభూమిపై చెలరేగిన వివాదానికి 2019 నవంబర్​9న సుప్రీంకోర్టు ముగింపు పలికింది. మన దేశంలోనే కాకుండా బాలి, ఇండోనేసియా ద్వీపాల్లో కూడా రామాయణ సంస్కృతి విలసిల్లుతోంది. పాకిస్తాన్‌‌లో రాముడి కొడుకు ‘లవుడి’ పేరుతో నగరం ఉంది. దేశంలో దాదాపుగా అన్ని గ్రామాలు, నగరాల్లో రామాలయాలు ఉన్నాయి. నేపాల్‌‌లోని జనకపురి నుంచి దక్షిణంలోని రామేశ్వరం వరకు అడుగడుగునా రామాయణ సంస్కృతే. లంకానగరం గొప్పతనం చూసిన లక్ష్మణుడు.. రావణుడిని చంపిన తర్వాత ‘ఇక్కడే ఉండిపోదాం అన్నయ్యా!’ అని రాముడిని కోరితే రాముడు చెప్పిన ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అనే వాక్యం భారత రాజనీతిని నిర్దేశిస్తుంది. రావణుడిని చంపిన తర్వాత రాముడు తనను ‘లంకాధిపతి’గా ప్రకటించుకోలేదు. రాముడి ఆదర్శాలు ఉన్న కారణంగానే స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ ఎంత కష్టపడినా, నెహ్రూకు ‘రాజ్య సింహాసనం’ ఇవ్వగలిగారు. ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన తర్వాత విడుదల చేసిన పత్రంలో ‘మమ్మల్ని అత్యాచారం చేయని ఏకైకజాతి హిందూజాతి. ఆ జాతికి కృతజ్ఞతలు’ అని ప్రకటించింది. దీనికి కారణం అంతర్గతంగా అందరిలో ప్రవహించే రామాయణమే. అలాంటి రామజన్మభూమిలో ఆయన మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. బాబర్‌‌‌‌ పేరుతో మసీదు నిర్మాణం 1526లో బాబర్ దండయాత్రల ద్వారా మన దేశంలోకి అడుగుపెట్టాడు. అతడి ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మన దేశ సంస్కృతిపై దాడిచేశాడు. అతడి సేనాని మీర్ బాకీ 1528లో అయోధ్యలో మందిరాన్ని కూడా ధ్వంసం చేశాడు. అదే స్థలంలో బాబర్ పేరుతో మసీదు నిర్మించాడు. తర్వాత రామమందిరం కోసం జరిగిన అనేక యుద్ధాలలో ఎందరో హిందువులు నేలకొరిగారు. 1885, 1934లో అక్కడున్న ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి. 1885లో బాబ్రీ వివాదాస్పద కట్టడం మధ్యలోని రామ్ చబుత్ర ప్రాంతంలో మందిరాన్ని నిర్మించాలని కోరుతూ మహంత్ రఘువరదాస్ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. 1949లో అక్కడ విగ్రహాలు ఉన్నాయని ఫైజాబాద్ మెజిస్ట్రేట్ ప్రార్థనా మందిరానికి సీలు వేయించాడు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండగా 1984 ప్రాంతంలో షాబానో మనోవర్తి కేసు తర్వాత, హిందువుల్లో చెలరేగిన అలజడిని తగ్గించడానికి 1986లో రామమందిరానికి వేసిన తాళాలు తెరిచారు. 1949 నుంచి రామమందిర నిర్మాణం కోసం పోరాడుతున్న పరమహంస రామచంద్రదాస్, ఆనాటి కాంగ్రెస్ నాయకుడు దావూదయాళ్ ఖన్నా రామ జన్మభూమి విముక్తి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన అనేక సాంస్కృతిక ఉద్యమాలు మందిర ఉద్యమానికి జీవం పోశాయి. సర్దార్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖుల సహకారంతో సోమనాథ్ మందిరం పునర్నిర్మాణం జరిగినట్లే అయోధ్యలో మందిరం నిర్మించాలని హిందువులు కోరుకున్నారు. ఉద్యమానికి ఊపిరి పోసిన అద్వానీ రథయాత్ర రామ మందిర నిర్మాణ విషయంలో.. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర కీలక మలుపనే చెప్పాలి. ఆయన రథయాత్ర దేశంలో సరికొత్త రాజకీయ పవనాలు వీచేటట్లు చేసింది. ఈ సందర్భంలో అద్వానీ చెప్పిన ఉదాహరణ .. ‘పోలాండ్‌‌లోని వార్సా నగరాన్ని రష్యా ఆక్రమించుకున్నపుడు (1614––1915) రష్యన్లు వార్సాలోని ప్రధాన సెంటర్లలో ఒక ఈస్ట్రన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ కేథడ్రల్‌‌ నిర్మించారు. 1918లో పోలాండ్‌‌ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశ ప్రజలు ఈ కేథడ్రల్‌‌ను కూల్చేశారు. ఎందుకంటే రష్యన్లు దాన్ని మతపరమైన కారణాలతో కాకుండా రాజకీయ కారణాలతో నిర్మించారని పోలాండ్‌‌ ప్రజలు భావించారు. కానీ మా వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. మేం బాబ్రీ కట్టడాన్ని గౌరవంగా తరలిస్తాం’ అని చెప్పారు. ఆనాడు అద్వానీ చెప్పినదానిలో మొదటిది జరిగింది. నాడు దేశంలోని తమను తాము సెక్యులర్‌‌‌‌గా అతిగా ఊహించుకున్న నాయకులు, కమ్యూనిస్టులు, అద్వానీ రథయాత్రను తప్పుగా చూపించారు. అయోధ్య పట్ల కొందరి వ్యతిరేకత భారత రాజకీయ గతిని మార్చేసింది. దేశంలో మరో జాతీయోద్యమానికి అదే నాంది పలికింది. ఎందరో రామభక్తులైన కరసేవకులపై ములాయంసింగ్ హయాంలో దాడులు జరిగాయి. రథయాత్రను బీహార్‌‌లో లాలూప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. అనంతర పరిణామాలు రష్యన్ కాథడ్రల్ లాగే 1992 డిసెంబరు 6న బాబ్రీ కట్టడం కూల్చివేతకు దారితీశాయి. హిందువులంతా భాగం కావాలనే.. వందల ఏళ్ల నుంచి హిందూ జాతి మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కల అయోధ్య రామ మందిర నిర్మాణం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో హిందువులంతా భాగం పంచుకోవాలనే సదుద్దేశంతో ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ నుంచి వచ్చే మాఘ పూర్ణిమ వరకు విరాళాల సేకరణ మొదలు పెట్టింది. తెలంగాణలో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రతి హిందువు తన శక్తికొద్దీ విరాళాలు ఇచ్చి  రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం ఇది. పరిష్కారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఓట్ల కోసం కక్కుర్తి పడిన కాంగ్రెస్ ఇంతటి జటిలమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాలని ఏనాడూ అనుకోలేదు. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న మొదటి ఐదేండ్లలో విచారణ పూర్తికావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు సుప్రీంలో పిటిషన్ వేశారు. గతంలోనూ చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు మతాల నాయకుల మధ్య రాజీ ప్రయత్నాలు చేసినా కమ్యూనిస్టులు వాటిని సక్సెస్‌‌ కానివ్వలేదు. చివరికి బ్రిటిషు కాలం నుంచి ప్రింట్ చేసిన 1854, 1877, 1881, 1892, 1905 గెజిట్లు, 1880 పునరావాస రిపోర్టు, 1838 సర్వేయర్ రిపోర్టు, 1891, 1934 పురాతత్వ శాఖ రిపోర్టు, 1975-–80 మధ్య జరిగిన పురాతత్వ తవ్వకాల రిపోర్టు, లక్నో ఇస్లామిక్ అకాడమీ అధిపతి మౌలానా అకిం సయ్యద్ అబ్దుల్ అరబిక్‌‌లో రాసిన పుస్తకం సాక్ష్యాధారాలు, ఇతర పుస్తకాలు, ప్రతులు సుప్రీంకోర్టు తీర్పుకు ఉపయోగపడ్డాయి. విచిత్రం ఏమిటంటే తీర్పు వెలువడిన వెంటనే ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు, అసదుద్దీన్ ఒవైసీ సుప్రీం తీర్పును సమర్థిస్తున్నాం అంటూనే సన్నాయి నొక్కులు నొక్కారు. డా.పి. భాస్కరయోగి,సామాజిక విశ్లేషకుడు