Sri Rama Navami 2025: మానవుడై పుట్టి మాధవుడైనాడు శ్రీ రాముడు

Sri Rama Navami 2025: మానవుడై పుట్టి మాధవుడైనాడు శ్రీ రాముడు

రాముడి గురించి వర్ణిస్తూ.. ‘మానవుడై పుట్టి మాధవుడైనాడు...’ అన్నాడు ఓ కవి.దశరథుడు’ అనే మహారాజు గారి అబ్బాయి శ్రీరాముడు. శ్రీరాముడి కల్యాణం... ఇంటింటి కల్యాణం. ఎందుకు ఆ రాముని కల్యాణం ఇంటింటి కల్యాణం అయింది. రాముడు పూర్వభాషి, మిత భాషి, హితభాషి. అంతేకాదు... శత్రువుని కూడా తనతో సమానంగా చూసిన సుగుణాభి రాముడు. రాముని ప్రయాణం ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. రాముడు ఎందుకు దేవుడయ్యాడో అర్థం చేసుకుందాం. 

యాగరక్షణకు రామలక్ష్మణులను పసి ప్రాయంలోనే విశ్వామిత్రుడు వెంట తీసుకెళ్లాడు. ఆయనను మౌనంగా అనుసరించారు. రామలక్ష్మణుల దీక్షను అర్థం చేసుకున్న విశ్వామిత్రుడు వారికి సకల విద్యలు బోధించాడు. 

ఎవరి వద్ద ఎలా మెలగాలో గురువులు చెప్పకుండానే తెలుసుకున్నారు. గురువుల సమక్షంలో, ఆయన అనుజ్ఞ మేరకు శివధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు. తండ్రి అనుమతితో సీతారాముల కల్యాణం జరిగింది. ఇంతవరకు రాముడి జీవితం సాఫీగా జరిగిపోయింది.

ఒకనాడు దశరథుడు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాడు. తక్షణమే ఆజ్ఞ జారీ చేశాడు. రాముడిని పిలిచి పట్టాభిషేకానికి సిద్ధం కమ్మన్నాడు.

ముందు రోజు రాత్రి... పట్టాభిషేకానికి రాజు పాటించవలసిన నియమాలను వివరించాడు. రాముడు తండ్రి మాటను అనుసరించి, నియమవ్రతుడయ్యాడు. 

తెలతెలవారుతుండగా రాముడిని పిలిచి కైకేయి కోరిక మీద అరణ్యవాసానికి బయలుదేరమన్నాడు.

రాముడు ‘సరే’ అన్నాడు. ఎందుకు అని ఎదురుప్రశ్న వేయలేదు. తక్షణమే నార వస్త్రాలు ధరించి, సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరాడు.

కైకేయిలోని ఈర్ష్య, అసూయ, శత్రు భావాలను రాముడు పట్టించుకోలేదు. ‘అమ్మా! వెళ్లి వస్తాను’ అని కైకేయి దగ్గర సెలవు తీసుకున్నాడు.

అరణ్యవాసం సమయంలో సీతమ్మ కోరిక మేరకు బంగారు లేడి కోసం వెళ్లాడు రాముడు.

అదను చూసి సీతమ్మను అపహరించాడు రావణుడు.

ఆవిడను అన్వేషిస్తూ రాముడు కిష్కింధకు చేరాడు.

అక్కడ హనుమ సాయంతో సుగ్రీవునితో మైత్రి చేశాడు.

సుగ్రీవుడు కూడా తనలాగే భార్యా విరహంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇద్దరిదీ ఒకే సమస్య కనుక ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకుని సాయపడగలరని భావించాడు రాముడు. సుగ్రీవుని కోరిక మేరకు వాలిని సంహరించడానికి రాముడు అంగీకరించాడు. ‘‘లక్ష్మణుడు నీ కంఠమునందు కట్టిన ఈ గజపుష్పలత నీకు ఆనవాలుగా ఉంది కదా. ఈ రోజు నేను యుద్ధంలో ఒక్క బాణాన్ని ప్రయోగించి, నీకు వాలి వలన కలిగిన భయాన్ని, వైరాన్ని తొలగిస్తాను’’ అని ధైర్యం చెప్పాడు. వాలిసుగ్రీవుల మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. వాలిని బాణం వేసి కొట్డాడు రాముడు. రాముడు.. నేల కూలిన వాలి దగ్గరకు రాగా, వాలి, ‘రామా! నన్ను చెట్టు చాటు నుండి సంహరించడం న్యాయమేనా? నేను నీకు ఏం అపకారం చేశానని నన్ను ఈ విధంగా సంహరించావు’ అని ప్రశ్నించాడు. అందుకు రాముడు, తాను రాజునని, రాజధర్మం ప్రకారం జంతువులను వేటాడానని పలికాడు. ‘నీ కుమారుడిని ఈ కిష్కింధ రాజ్యానికి యువ రాజును చేస్తాను’ అని వాలి చేతిలో చేయి వేసి, అతడికి సాంత్వన కలిగించాడు. రాముడి మాటలలోని ధర్మాన్ని గ్రహించిన వాలి హాయిగా కన్నుమూశాడు. వాలి తనకు శత్రువు కదా అని రాముడు వాలి మరణించిన తరువాత అతడిని నిర్లక్ష్యం చేయకుండా, హాయిగా కన్నుమూసేందుకు దోహదపడ్డాడు.

విరాధుడు అనే రాక్షసుడు రామలక్ష్మణులను కబళించడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు విరాధుడి రెండు బాహువులను రామలక్ష్మణులు ఏకకాలంలో ఖండించారు. విరాధుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, తనను దహనం చేయమని అర్థించాడు. అలా చేయడం వలన తనకు పూర్వజన్మ లభ్యమవుతుందని పలికాడు. అంతటి భయంకరుడైన విరాధుడు రామలక్ష్మణులను తినేయబోయినప్పటికీ, రాముడు విరాధుడికి శాపవిమోచనం కలిగేందుకు సహకరించాడు. అలా విరాధుడు గంధర్వ రూపం ధరించి రాముడికి రావణుడి లంకకు వెళ్లే మార్గం తెలిపాడు. 

ఇక అసలైన శత్రువు రావణుడు... రాముడు వానరసేన సాయంతో లంక సమీపించాడు. రావణాసురుడి పరివారమంతా రాముడి చేతిలో హతమయ్యింది. చివరకు రావణుడు యుద్ధరంగానికి చేరుకున్నాడు. సాయం సమయానికి రావణుడు అలసి పోయాడు. రథం, ఆయుధాలు అన్నీ కోల్పోయాడు. ఆ సమయంలో రాముడు, తన శత్రువైన రావణునితో, ‘నువ్వు అలసి పోయావు. నీ చేతిలో ఆయుధాలు కూడా లేవు. నేడు పోయి, రేపు రమ్ము’ అన్నాడు. అదీ రాముని గొప్పదనం. 

అందుకే అనన్వయాలంకార లక్షణాలు చెబుతూ...

గగనం గగనాకారం సాగరః సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ  అని చెప్పారు.

ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చుతారు. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చుతారు. రామరావణ యుద్ధాన్ని రామరావణ యుద్ధంతోనే సరిపోల్చుతారు. అంతటి ఘనుడు రాముడు.

రావణ మరణానంతరం అంత్యక్రియలు నిర్వర్తించమని విభీషణునితో చెప్పాడు రాముడు. అందుకు విభీషణుడు, ‘ఇంతటి దుర్మార్గుడికి దహన క్రియలు ఎందుకు’ అన్నాడు. అప్పుడు రాముడు ‘విభీషణా, మనిషి మరణంతో శత్రుత్వం కూడా మరణించాలి’ అన్నాడు. అదీ రాముని సహృదయత. అందుకే రాముడు మనిషిగా పుట్టి దేవుడయ్యాడు. సీతారాముల కల్యాణం ఇంటింటి కల్యాణం అయింది.

‘కోదండ కళాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌‌‌‌ రెండవ సాటి దైవమికలేదనుచున్‌‌‌‌’ (33) అని కీర్తించాడు రామదాసు.
- డా. పురాణపండ వైజయంతి