భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజైన మంగళవారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవమూర్తులకు విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ నిర్వహించారు. కల్యాణంలో పాల్గొనే రుత్విక్కులకు ఈవో రమాదేవి దీక్షా వస్త్రాలు అందజేశారు. దేవనాధ రామానుజ జీయర్​స్వామి వేదపారాయణం చేశారు. ఉత్సవాంగ స్నపనం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. 

సాయంత్రం తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయంలో పూజలు చేశారు. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో పుట్టమన్ను సేకరించి రామాల యంలోని యాగశాలకు తీసుకువచ్చారు. వాస్తుహోమం నిర్వహించి నవధాన్యాలను పుట్టమన్నులో కలిపి అంకురార్పణ చేశారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. తిరువీధి సేవకు రాజ వీధి నుంచి తాతగుడి సెంటర్​ వరకు వెళ్లిన స్వామి అక్కడ గోవిందరాజస్వామి ఆలయంలో పూజలు అందుకున్నారు. ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు,అమరవాది విజయరాఘవన్‍, కోటి శ్రీమాన్ ,అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, స్థలసాయి పాల్గొన్నారు.