
- ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనం నిర్వహించిన అర్చకులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని శ్రీసీతారామంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సావాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. ముందుగా మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులను బేలా మండపంలో అధిష్ఠింపజేసి, కలశాల్లో నదీజలాలు ఆవాహన చేశాక, వాటిని గర్భగుడిలోని మూలవరుల వద్దకు తీసుకెళ్లారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు స్వామి వారి వద్ద అనుజ్ఞ తీసుకున్న అనంతరం బేలా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, స్నపన తిరుమంజనం జరిపారు.
కల్యాణ కార్యక్రమంలో పాల్గొనే రుత్విక్కులకు ఏఈవో శ్రావణ్‌కుమార్ దీక్షా వస్త్రాలు అందజేశారు. ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, కోటి రామస్వరూపాచార్యులు, ఆచార్యులుగా అమరవాది విజయరాఘవన్, బ్రహ్మగా అమరవాది శ్రీనివాసరామానుజం, స్థానాచార్యులు స్థలసాయి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీరితో పాటు వేదాలు, రామాయణం, విష్ణుపురాణం, అష్టాక్షరీ మంత్రజపాలు నిర్వహించే రుత్విక్కులకు సైతం దీక్షావస్త్రాలు అందజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.
ఉత్సవాంగ స్నపనం.. పుట్టమన్ను సేకరణ
కలశాల్లో నదీజలాల ఆవాహన అనంతరం ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. జలాలు, పంచామృతాలతో వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ స్నపన తిరుమంజనం జరిపారు. స్వామికి నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి రాజవీధి గుండా తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు ఊరేగింపు జరిపారు.
గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో పుట్టమన్ను సేకరించి రామాలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. వాస్తుహోమం నిర్వహించి నవధాన్యాలను పుట్టమన్నులో కలిపి అంకురార్పణ చేయడంతో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు అర్చకులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే నిత్య కల్యాణాలు, దర్బారు, పవళింపు సేవలను రద్దు చేశారు. అలాగే స్వామి వారిని కల్పవృక్ష వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు.
ఉత్సవాలకు రావాలని గవర్నర్‌కు ఆహ్వానం
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిశారు. ముందుగా వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం చేసిన అనంతరం ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాలు అందజేశారు. శ్రీరామనవమి కల్యాణ స్వాగత గీతాన్ని గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.