భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న మిథిలాస్టేడియంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం జరుగుతాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తర్వాత పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 13న మండల లేఖనం, 14న గరుడ ధ్వజపటలేఖనం, అధివాసం, 15న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం,దేవతాహ్వానం, 16న ఎదుర్కోలు, 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం, అదేరోజు రాత్రి రథోత్సవం, 19న కల్యాణ సీతారాములకు సదస్యం ఆశీర్వచనం, 20న తెప్పోత్సవం, 21న ఊంజల్ సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, బ్రహ్మోత్సవాలతో పరిసమాప్తి జరుగుతుంది. బ్రహ్మోత్సవాల కారణంగా ఈనెల 23 వరకు నిత్య కల్యాణాలు, దర్బారు సేవ, మే 1 వరకు పవళింపు సేవలను నిలిపివేశారు. ఈనెల 17న సాయంత్రం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభించి, మే 13న విరమణ చేస్తారు.
వైదిక కమిటీ ఏర్పాటు
బ్రహ్మోత్సవాలు నిర్వహించే వైదిక కమిటీని దేవస్థానం ప్రకటించింది. స్థానాచార్యులు స్థలసాయి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు రామం, అమరవాది విజయరాఘవన్, ఆచార్యులుగా కోటి శ్రీమాన్, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, రుత్విక్లుగా మురళీకృష్ణమాచార్యులు, సీతారామాచార్యులు, పరిచారక రుత్విక్కులుగా రాఘవాచార్యులు, అలంకార రుత్విక్లుగా రామస్వరూప్, విష్ణు వ్యవహరించనున్నారు.
గవర్నర్కు రాజపత్రం అందజేత
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈఓ ఎల్ రమాదేవి సోమవారం రాజపత్రం అందజేశారు. అర్చక బృందం ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపిక అందించారు. బ్రహ్మోత్సవాలకు భద్రగిరిని ముస్తాబు చేసినట్టు ఈఓ చెప్పారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి ఏర్పాట్లు చేశామని, చలువ పందిళ్లు, బట్టలు మార్చుకునే రూంలు రెడీ చేశామన్నారు. కల్యాణం రోజు మిథిలాస్టేడియంలోని అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేస్తామని, ఎల్ఈడీ స్క్రీన్లు పెడతామని చెప్పారు. 250 క్వింటాళ్ల తలంబ్రాలు, 2.50లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్టు తెలిపారు.