యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో .. వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోశ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదగిరిగుట్టపై అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం(శివాలయం)లో సీతారామ హనుమంతుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం శివాలయంలో నిత్యారాధనలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు యాగశాలలో సీతారామ హనుమత్ మూలమంత్ర జపాలు, దశశాంతి పంచసూక్త పారాయణాలతో అభిషేకాలు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలు నిర్వహించారు. 

అనంతరం సీతారామ హనుమంతుడి మూర్తులకు అష్టోత్తర శతనామార్చనలు, దశావరణ పూజ చేశారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు యాగ మండపంలో సీతారామ హనుమంతుడి ఉత్సవ విగ్రహాలకు సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్పాలు, తీర్థప్రసాద వితరణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు పాల్గొన్నారు.