
ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. తండ్రి మాట జవదాటక ఇచ్చిన మాటకోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, పరిస్థితుల ప్రభావంతో భార్య దూరంకాగా నిరంతరం అమె కోసం పరితపించిన భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు.
త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతోంది. తండ్రికి ఇచ్చిన మాటకోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే. రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు శ్రీరాముడు. నిత్యం సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు.
సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.
జీవిత విలువలను బోధించే రామాయణం
రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాధ్వీమణి సీతమ్మ కూడా ఆడవారికి మార్గదర్శి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. ధనుర్ధారుడు, అమిత పరిజ్ఞానం, దృఢ సంకల్పం కలిగిన యోధుడు. బ్రాహ్మణులు, ప్రజలు, స్త్రీలు, మానవజాతి రక్షకుడు. తోటి పౌరుల పట్ల కనికరం ఉన్న ఆదర్శ రాజు. ధర్మాన్ని అత్యున్నత క్రమంలో సామాజిక నిబంధనలను సమర్థించినవాడు.
శాంతిని ప్రేమించే, ఆధ్యాత్మిక, గౌరవప్రదమైన తెలివైన వ్యక్తిత్వం. తల్లిదండ్రులు, గురువులు, గౌరవనీయులైన పెద్దల పట్ల భక్తిప్రపత్తులు. రాజ్య శ్రేయస్సు ప్రధానం. తన ఆసక్తిని స్వీయ త్యాగం చేసే వ్యక్తి. జీవిత కాలంలో ఒక వివాహ ధర్మాన్ని పాటించి భార్య సీతాదేవికికు పూర్తిగా అంకితమయ్యాడు. దైవికశక్తులతో దుష్టసంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. దైర్యసాహసాలు, సహనశీలత, దయార్ధగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత అందుకే సకల గుణాభిరాముడంటారు. సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాదరణ పొందాడు.
దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధపాలకుడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు మార్గనిర్దేశంనం చేసిన మంచి సోదరుడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికీ స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు.
ప్రజలందరికీ సమన్యాయం
ప్రజలే ముఖ్యమనుకున్న ఆదర్శ రాజు. అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణనలోకి తీసుకుని భార్యను అడవులకు పంపి ప్రజల మాటకు విలువనిచ్చాడేగానీ సాద్వీమణి సీతాదేవిని శంకించలేదు. నీతి తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామరాజ్యం అనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమన్యాయం, సమాన గౌరవం అందించడమే తన కర్తవ్యమని భావించాడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాద పురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు.
శ్రీరాముడిలోని స్నేహశీలత గొప్పది. కిష్కింధ రాజైన వాలి సోదరుడు సుగ్రీవుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి మంచి స్నేహితులు. సుగ్రీవుడి రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు. లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్యాయబద్ధ ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు. రావణ సంహారం తర్వాత లంకా రాజ్యాన్ని విభీషుణికే అప్పగించి గొప్పదనాన్ని చాటుకున్నాడు. సకల కల్యాణ గుణాభిరాముడు శ్రీరాముడు. ఆ మహనీయుని జీవనయానమే శ్రీరామాయణం.
రాముడితోపాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తే ఆత్మత్యాగానికి సిద్ధపడింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి, మాయ సీతను రావణుడు తీసుకుపోయేలా చేశాడు. లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక. హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. రాముని పాలనలో ప్రజలు శుభలక్షణ సంపన్నులై ఉన్నారు. అందుకే రామరాజ్యం ఆదర్శం.
- నందిరాజు రాధాకృష్ణ,
సీనియర్ జర్నలిస్ట్