ఏప్రిల్ 9 నుంచి 23 వరకు భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ ఏప్రిల్​17న సీతారాముల కల్యాణం నిర్వహించాలని బుధవారం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్​9(ఉగాది రోజు) నుంచి 23వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

13న మండల లేఖన, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులు, సార్వభౌమ వాహన సేవ, 14న గరుడ ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడాధివాసం, 15న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీతాడనం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమంత వాహన సేవ, 16న యాగశాల పూజ, చతు:స్థానార్చన, ఎదుర్కోలు, 17న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, 18న మహాపట్టాభిషేకం, 19న మహదాశీర్వచనం, 20న తెప్పోత్సవం, డోలోత్సవం, 21న ఊంజల్​సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధజ్వావరోహణం, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్​9 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేశారు. మే 1వ తేదీ వరకు పవళింపు సేవలు జరగవని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. భద్రాచలం దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించే ముహూర్తమే దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి నిర్వహణకు కొలమానమనే సంగతి తెలిసిందే.