
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రధాన అర్చకులు శరత్ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మరోవైపు పంచోపనిషత్ ద్వారా అభిషేక ప్రత్యేక పూజలు చేశారు. 8 రోజుల పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. వచ్చే నెల 6న సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి రోజు ప్రత్యేక పూజల అనంతరం రాత్రి సమయలో పార్వతీ రాజరాజేశ్వరస్వామి, అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన పెద్ద సేవపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు రాజన్న ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలెన్లలో గంటల తరబడి వేచి చూసి దర్శించుకున్నారు.