- 16న ఎదుర్కోలు, 17న కల్యాణం, 18న పట్టాభిషేకం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శివాలయ ముఖ మంటపంలో గణపతి పూజ, స్వస్తివాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనతో ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. అనంతరం పంచగవ్య ప్రాశన పూజలు చేశారు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఈనెల 20 వరకు జరగనున్నాయి. తొలిరోజు పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి దంపతులు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ పాల్గొన్నారు. ఇక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు ఈనెల 16న శ్రీరాముడి ఎదుర్కోలు, 17న సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈనెల 20న నిర్వహించే నిత్య పూజాదులు, కంకణ విమోచనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఏఈవో జూశెట్టి కృష్ణగౌడ్, సూపరింటెండెంట్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.