పునరుజ్జీవ ఎత్తిపోతలు.. ఉత్తవేనా?.

తెలంగాణ ప్రభుత్వం జులై 7 నుంచి కాళేశ్వరం నీళ్లను అనేక దశల ఎత్తిపోతలతో11 రోజులు వరద కాలువ మీదుగా ‘పునరుజ్జీవం’ పేరిట శ్రీరాంసాగర్​లో పోశారు. ఈ నీళ్లను స్థానిక ఆయకట్టు రైతులకు చూపడానికి వేలాది మందిని స్థానిక మంత్రి ప్రశాంతి రెడ్డి వరద కాలువ, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వద్దకు తరలించారు. స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి తదితర మంత్రులు కాళేశ్వరం నీళ్లపై పూలు చల్లారు. 

కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందన, ఈ నీళ్లతో ఓట్ల ప్రయోజనం ఆశించడం సాధారణమే. కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్​కు ఎదురు ఎత్తిపోయడం కలియుగ భగీరథుడు కేసీఆర్​ ఘనతేనని, ‘గల గలా పారే గోదారి ఎదురెక్కంగ.. చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ మురువంగా’ అని పునరుజ్జీవం నీళ్ల దృశ్యాలపై ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేల బొమ్మలతో సోషల్​మీడియాలో వీడియోలు వైరల్​గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు హడావిడి చేసినట్టు ఏమైనా ఫలితం దక్కిందా? లేదా అన్నది పరిశీలించాలి.

రాష్ట్ర ప్రభుత్వం రోజుకో టీఎంసీ నీళ్లను ఎత్తిపోయాలన్న లక్ష్యంతో దాదాపు రూ.2 వేల కోట్లతో శ్రీరాంసాగర్​ పునరుజ్జీవ పథకం తీసుకువచ్చింది. జులై 7 నుంచి 17 వరకు శ్రీరాంసాగర్​కు  కాళేశ్వరం నీళ్లు తరలించారు. గత 11 రోజుల్లో ఏ ఒక్క రోజు ఒక్క టీఎంసీ కాదు కదా, సగం టీఎంసీ కూడా ఎత్తిపోయలేదు. ఎందుకంటే.. రోజుకు ఒక టీఎంసీ నీళ్లు ఎదురెక్కవని, వరద కాలువ డిజైన్​తప్పుల తడకని నిపుణుల విశ్లేషణ. రోజుకో టీఎంసీని ఎత్తిపోస్తామని ఆనాడు బాహాటంగా చెప్పిన పెద్దలు.. ఇప్పుడు దాన్ని చేసి చూపలేకపోయారు. వరద కాలువ పునరుజ్జీవన ఎత్తిపోతల డిజైన్​ రోజుకొక టీఎంసీ అని రూ. 2 వేల కోట్లు జేబులేసుకున్నట్టేనా? రోజూ అర టీఎంసీ నీళ్లు కూడా శ్రీరాంసాగర్​కు ఎదురెక్క లేదు. మోడల్​ స్టడీ, ట్రయల్​ రన్​ చేయలేదు. 

పాలకులు నిర్మాణ కంపెనీ జమిలిగా, ఉద్దేశ పూర్వకంగా వందల కోట్లు అవినీతి చేశారన్న ఆరోపణలకు వాస్తవ పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయి. సదరు కంపెనీని ప్రాసిక్యూట్​ చేసి, మోసానికి పరిహారం కక్కించి, బ్లాక్​లిస్ట్​లో పెట్టి, సీబీఐ విచారణ చేయించాల్సిన అవసరం లేదా? అనేక దశల్లో ఎత్తిపోసిన నీళ్లు చాలా ఖరీదైనవి. నీళ్లను చూపి ప్రజలను వంచించడం తేలిక. కాళేశ్వరం బిల్లుల మోతతో, ఇంత ఖరీదైన నీళ్లను పంటలికివ్వడం సరైన పాలకుడికి సాధ్యం కానిపని. కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్​ను నింపినట్టు పంటలు పండించినట్లు నేతలు కల్పించే భ్రమలకు ప్రజలు మోసపోవద్దు. 

విద్యుత్ ​సంస్థల దుస్థితి

తెలంగాణ డిస్కంల అసమర్థతకు ‘బీ’ గ్రేడ్​ వచ్చింది. ఆదాయం, అవసరాల మధ్య భారీ అంతరం ఉంది. ఉత్తర డిస్కంలో యూనిట్​కు రూ.1.11, దక్షిణ డిస్కంలో రూ.1.04 అంతరం ఉంది. 2020–21 ఏడాదికి కేంద్రం ఇటీవల గ్రేడింగ్​విడుదల చేసింది. అందులో మన విద్యుత్​ పంపిణీ సంస్థల పరిస్థితి దిగజారింది. ఆర్థిక పరిస్థితి, నిర్వహణ, వ్యాపారం, వినియోగదారుల సేవలపై ‘బీ’ గ్రేడ్ ​వచ్చింది. ఉత్తర, దక్షిణ డిస్కంలకు ‘డీ’ గ్రేడ్​వచ్చింది. 100 మార్కులకు 60 మార్కులే వచ్చాయి. విద్యుత్​ సంస్థలు వేల కోట్ల అప్పుల గుట్టలుగా మారాయి.  విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించే విషయంలో ఉత్తర డిస్కం​260 రోజులు, దక్షిణ డిస్కం​306 రోజులు ఆలస్యం చేస్తున్నాయి.  ఏటీ అండ్​ సీ నష్టాలు ఉత్తర డిస్కంలో 9.03 శాతం, దక్షిణ డిస్కంలో 15.48 శాతం ఉన్నాయని తేలింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అనేక దశల ఎత్తిపోతలు రాష్ట్రాన్ని, విద్యుత్​ సంస్థల దుస్థితిని దిగజార్చినట్లుగా భావించాలి. 

విద్యుత్​ ఉత్పత్తి సంస్థ(జెన్కో) రూ. 40 వేల కోట్లు బ్యాంకులకు అప్పు ఉంది. ట్రాన్స్​కో 35 వేల కోట్ల అప్పు చేసింది. డిస్కంలు 20 వేల కోట్లు బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చాయి. ఈ విద్యుత్​సంస్థల అప్పులన్నీ 95 వేల కోట్లు. విద్యుత్​సంస్థలు వాటి వ్యాపారంలో జరిగిన నష్టాలు 50 వేల కోట్లు పేరుకుపోయాయి. తెలంగాణ విద్యుత్​ సంస్థల సమర్థతను దెబ్బతీసిన రాష్ట్ర​సర్కారు.. ఘోరమైన తప్పిదాలు చేసింది. పనితీరుతో కేంద్రం మన విద్యుత్​సంస్థలకిచ్చిన ‘బీ’, ‘డీ’ గ్రేడులే ఈ దుస్థితికి అద్దంపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి ప్రధాన హేతువు. ప్రాణహిత నుంచి కాళేశ్వరానికి వచ్చే నీళ్లతో, మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండై, బిల్లులకు వణికి ఎత్తిపోయలేని దుస్థితిలో సముద్రంలోకి రోజూ లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే..

తెలంగాణలో ప్రాణహిత నుంచే భారీ నీళ్లు వస్తున్నాయి. ప్రాణహిత నీళ్లు తప్ప మేడిగడ్డలో కేసీఆర్ ​చెప్పిన ఏ నీళ్లు ఎత్తిపోయడానికి వీలుకాదని, ఎత్తినవి సముద్రానికి పోతున్న తీరు ఏటా రుజువవుతోంది.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఎత్తిపోసిన నీళ్లన్నీ .. కడెం, ఎల్లంపెల్లి లక్షల క్యూసెక్కుల భారీ ఎదురు వరదతో వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. నేడు 3 బ్యారేజీల మోటర్లన్నీ నడపాలంటే సర్కారుకు చుక్కలు కనపడుతున్నాయి. ప్రాణహితను రద్దు చేసి, మేడిగడ్డ వద్ద నిర్మించి, ఎల్లంపెల్లికి గోదావరికి 128 మీటర్ల ఎదురు ఎత్తిపోయడం తెలంగాణకు గుదిబండగా మారింది. రాష్ట్రాన్ని భారీ అప్పుల్లో ముంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని చెబుతూ..ఎత్తిన నీళ్లను ప్రకృతి ఏటా సముద్రంలో కలిపి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు గట్టి గుణపాఠం నేర్పుతున్నది. కాళేశ్వరం రీ–ఇంజనీరింగ్​తప్పని ప్రతి చుక్కా ఘోషిస్తున్నది. తుమ్మిడిహెట్టి నిర్మించి ఉంటే 71 కిలోమీటర్ల గ్రావిటీతో, 19 మీటర్లు ఎత్తిపోతలతో ఎల్లంపెల్లికి సునాయాసంగా నీళ్లు చేరేవి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎత్తిపోతల వేల కోట్ల బిల్లులన్నీ తప్పేవి. 

సాగు లక్ష్యం ఇదేనా?

సాగు డిమాండ్​ ప్రకారం శ్రీరాంసాగర్ ​నుంచి కాకతీయ కాలువకు రోజూ 5000 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 600, లక్ష్మి కాలువకు 300, అలీసాగర్​కు 540, గుత్ప లిఫ్టుకు 270, భగీరథకు 152 క్యూసెక్కులు ఇలా మొత్తం రోజులకు 6,862 క్యూసెక్కుల నీరు అంటే 0.68 టీఎంసీ నీరు ప్రతి రోజు పైకాలువల ద్వారా పంటలకు అందించాలి. ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం నుంచి శ్రీరాం సాగర్​కు11 రోజుల్లో ఎత్తిపోసిన నీళ్లు దాదాపు రెండున్నర టీఎంసీలు. పునరుజ్జీవ పథకంలో డిజైన్​లో చెప్పినట్టు ఈ రెండున్నర టీఎంసీల ఎత్తిపోసిన నీళ్లతో శ్రీరాంసాగర్​ ఆయకట్టు కింద14 లక్షల ఎకరాలు పండించడం సాధ్యం అవుతుందా? కచ్చితంగా సాధ్యం కాదు. కాళేశ్వరం(మేడిగడ్డ) వద్ద17 మోటార్లున్నాయి. 

ఇలా అనేక మోటార్లు రోజుకు 2 టీఎంసీల నీళ్లను అన్ని దశల్లో ఎగువకు ఎత్తిపోయాలి. వాటిల్లో 5,6 మోటార్లు మాత్రమే 17 రోజులు నడిపించి ఎందుకు ఆపారు? మొత్తం మోటార్లను ఎందుకు నడపలేదు? మౌలిక సదుపాయాలున్నా, రోజూ 2 టీఎంసీల నీరు ఎందుకు ఎత్తిపోయలేదు? మూడో టీఎంసీ అనుమతికి కేంద్రం, సుప్రీంతో కొట్లాడిన కేసీఆర్, రెండో టీఎంసీ ఉండి ఎందుకు ఎత్తిపోయడం లేదు? మేడిగడ్డ వద్ద నుంచి దిగువకు వెళ్తూ ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తుంటే, ఇంత తక్కువ మాత్రమే ఎందుకు ఎత్తి ఆపారు? గత 17 రోజుల్లో 9 టీఎంసీల నీరు మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, కొంత ఎల్లంపల్లి వరకు ఎత్తిపోశారు. కడెం నుంచి భారీ వరద వచ్చి ఎల్లంపల్లి మీదుగా ఎత్తిపోసిన నీళ్లన్నీ సముద్రంలో కలిశాయి. ఈ జూన్​ 30 నాటికి ఒక్క మేడిగడ్డ పంప్​హౌస్ ​కరెంట్​ బిల్లు రూ.385 కోట్ల 64 లక్షల 18,970 బకాయివుందని బోగట్టా. 

ఎత్తిపోసుడు.. కిందికి వదులుడు

ప్రాణహిత వరద నీటితో మేడిగడ్డ బ్యారేజీ నిండు కుండను తలపిస్తున్నది. ప్రాణహిత నుంచి జులై13న 1.14 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డకు చేరింది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం16.17 టీఎంసీలు కాగా11.41 టీఎంసీలకు చేరింది. దీంతో బ్యారేజీ 36 గేట్లను ఎత్తి1.12 లక్షల క్యూసెక్కుల నీటిని, అంటే 9.63 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నాటి నుంచి ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నది. మేడిగడ్డ కన్నెపెల్లి వద్ద లక్ష్మి పంప్​హౌస్​ నుంచి 6 మోటార్ల ద్వారా14,708 క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోశారు. అన్నారం పంప్​హౌస్​ నుంచి 5 మోటార్ల ద్వారా14,655 క్యూసెక్కులు సుందిళ్లకు ఎత్తిపోశారు. సుందిళ్ల నుంచి 5 మోటార్ల ద్వారా13,050 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి బ్యారేజీలో ఎత్తిపోశారు. అక్కడి నుంచి నంది మేడారానికి 9,450 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయగా, 3600 క్యూసెక్కులు అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోశారు. అన్నారం పంప్​హౌస్​నుంచి 5 మోటార్ల ద్వారా14,655 క్యూసెక్కుల సుందిళ్లకు ఎత్తిపోశారు. 3 మోటార్ల ద్వారా ఆ నీటిని కరీంనగర్​ లక్ష్మిపూర్​ పంప్​హౌస్​కు ఎత్తిపోశారు.  శ్రీరాం సాగర్​కు 11 రోజుల్లో మేడిగడ్డ నుంచి రెండున్నర టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. నాలుగైదు రోజుల వర్షాలతో కడెం నుంచి వచ్చిన 1.87 లక్ష క్యూసెక్కులు ఎల్లంపెల్లికి చేరి, ఎత్తిపోసిన నీళ్లన్నీ తిప్పిపోతలై దిగువకు వెళ్తూ సముద్రంలో కలుస్తున్నాయి. 

‘కొంతకాలం కింద రాహుల్‌‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడంలో భాగంగా.. హెచ్‌‌ఏఎల్‌‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హెచ్​ఏఎల్​ కంపెనీ పని అయిపోయిందని ప్రజలకు అబద్ధాలు చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఇప్పుడు హెచ్ఏఎల్​రూ.1.35 లక్షల కోట్ల కంపెనీగా మారింది’’
-  రాజీవ్ ​చంద్రశేఖర్, కేంద్ర మంత్రి

‘‘ప్రతి కుటుంబానికి వాటర్ ఏటీఎం కార్డులు ఇస్తున్నాం. ఈ కార్డుతో  కుటుంబంలోని ప్రతి సభ్యుడికి రోజుకు 20 లీటర్ల శుద్ధి చేసిన నీరు అందుతుంది. పేదలు కూడా ప్రతిరోజూ ఆర్వో వాటర్ తాగవచ్చు. ఇప్పటి వరకు 2,000 కుటుంబాలకు ఈ కార్డులు ఇచ్చాం’’
-   అరవింద్ ​కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం

‘ప్రధానమంత్రి పార్లమెంట్​కు జవాబుదారి. పార్లమెంట్​లో ప్రధానిని ప్రశ్నించడానికి, కలవడానికి అవకాశం లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బహుశా ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఇదొక విచిత్ర పరిస్థితి’
-  శశిథరూర్, కాంగ్రెస్​ ఎంపీ

- నైనాల గోవర్ధన్,  ప్రొ. వినాయక్ ​రెడ్డి