
గంగాధర, వెలుగు: గట్టుభూత్కూర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. హనుమాన్ మాలధారులు, భక్తుల జై శ్రీరాం నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, నాయకులు కనకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి గుంటి హనుమాన్ ఆలయం వరకు డీజే పాటలు, యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, శ్రీరామంజనేయ దీక్షాపరుల భజన సంకీర్తనల నడుమ రథోత్సవం కొనసాగింది.
ముగిసిన రాములోరి జాతర..
రాయికల్: మండలంలోని తాట్లవాయి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రథోత్సవంతో జాతర ఉత్సవాలు ముగిశాయి. రాయికల్, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, జగిత్యాల, మేడిపెల్లి మండలాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు.