
భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగింది. ఈ వేడుక భక్తి ప్రపత్తులతో భక్తుల జయజయధ్వానాల మధ్య ఉత్సవమూర్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రధానాలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో సీతారామలక్ష్మణ స్వామితో ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం గరుడ పటాన్ని మంగళవాయిద్యాల నడుమ ధ్వజ స్తంభంపైకి ఎగుర వేశారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడు ఉత్సవాలు అయ్యే వరకు కాపు కాస్తాడని ప్రతీతి. ఇది బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీగా వస్తుంది.
గరుడ పటాన్ని ఆవిష్కరించిన అనంతరం బలిహరణం నిర్వహించారు. సంతానం లేనివారికి గరుడముద్దలు ప్రసాదంగా ఇచ్చారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపారు. అనంతరం స్వామికి తిరువీధి సేవ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం శనివారం జరగనుంది. చతుస్థానార్చన పూజలు చేస్తారు. ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో త్రిదండి దేవనాద జీయర్స్వామీజీ, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.