తిరుమంగై ఆళ్వార్​ జన్మనక్షత్రం వేళ ​అభిషేకం

తిరుమంగై ఆళ్వార్​ జన్మనక్షత్రం వేళ ​అభిషేకం

భద్రాచలం, వెలుగు : తిరుమంగై ఆళ్వార్​ జన్మనక్షత్రం వేళ శుక్రవారం భద్రాచలం రామాలయంలో ఆయనకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. చుట్టు ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్​కు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. స్థానాచార్యులు స్థలసాయి తిరుమంగై ఆళ్వార్​ గురించి భక్తులకు వివరించారు. అంతకు ముందు ఉదయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక స్వర్ణ కవచాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు.

లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, స్నపన తిరుమంజనం జరిగాక కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిపారు. బేడా మండపంలో సీతారాముల నిత్య కల్యాణం చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనలు, రాజబోగం నివేదించాక అద్దాల మండపంలో దర్బారు సేవ జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల వారికి సంధ్యాహారతిని ఇచ్చారు.

సీతారామచంద్రస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ సుదర్శన్​రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అందజేశారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కస్తాల అనగారావు అనే భక్తుడు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు.