కొత్తకొండ జాతరకు వేళాయే.. కుమ్మరోళ్ల బోనాలు.. కొత్తపల్లి ఎడ్ల రథాలు

  • కడిపికొండ, దామెర నుంచి తరలిరానున్న వీర బోనం
  • నేటి నుంచే జాతర ఉత్సవాలు ప్రారంభం 

హనుమకొండ, భీమదేవరపల్లి, వెలుగు: కోరిన వరాలిచ్చే కోరమీసాల రాయుడు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.  మకర సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం భద్రకాళి సమేతా వీరభద్రుడి కల్యాణ ఘట్టంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.  ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దాదాపు పది రోజులపాటు కనుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి.  స్వామివారి కల్యాణ మహోత్సవానికి సమర్పించే పుస్తె మెట్టెల నుంచి జాతర సమయంలో ఊరేగించే బండ్ల రథాల దాకా ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. 

వీరబోనం.. మేకపోతుల రథాలు 

  • కడిపికొండ, ఉల్లిగడ్డ దామెర గ్రామాలకు చెందిన కుమ్మరి కులస్తులు ఈ వీరబోనం సమర్పిస్తుండగా.. ఈ సంప్రదాయం 17వ శతాబ్ధం నుంచే ఉందని పూర్వీకులు చెబుతున్నారు.  తాము పండించిన బియ్యంతో కొత్తకుండలో బెల్లన్నం సిద్ధం చేసి భోగి పండుగ రోజు వీరభద్రుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. 
  • వేలేరు మండలంలో ఉండే జనకల వంశానికి చెందిన యాదవులు భోగి పండుగ సాయంత్రం మేకపోతుల రథాలతో ఫలహారాలను వీరభద్రుడికి నైవేద్యంగా వందేళ్ల నుంచి సమర్పిస్తున్నారు. 
  • రంగం వంశానికి చెందిన స్వర్ణకారులు తమ వ్యాపారవృద్ధి కోసం పుస్తే మెట్టెలు వీరభద్రుడి కల్యాణానికి సమర్పిస్తామని మొక్కుకున్నారు. కొత్తపల్లి ఎడ్ల రథాలు కూడా జాతరలో చాలా ఫేమస్ అని చెబుతుంటారు.  
  • కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పాపాలు తొలగుతాయని ప్రతీతి.  వీరభద్రుడి గుడిలో రుద్రాక్ష చెట్టు స్పెషల్​ అట్రాక్షన్​ గా నిలుస్తోంది.  దాదాపు 25 ఏండ్ల కిందట స్థానిక అర్చకుడు వినయ్​ శర్మ సద్గురు శివానంద మూర్తి చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటగా.. దేశంలోని ఏ  ఆలయంలో రుద్రాక్ష చెట్టు లేదని అర్చకులు చెబుతున్నారు. 

జాతర ఉత్సవాలు  ఇవే.. 

  • నేటి సాయంత్రం స్వామివారి కల్యాణ మహోత్సవం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్​ గౌడ్​ హాజరుకానున్నారు. 11న త్రిశూలార్చన, నవకలశార్చన, 12న లక్ష బిల్వార్చన, 13న భోగి పండుగ సందర్భంగా అరుణయంత్ర స్థాపన, 14న సంక్రాంతి సందర్భంగా బండ్లు తిరిగే కార్యక్రమం జరుగుతుంది. 15న కనుమ, 16న నాగవెల్లి, పుష్పయోగం, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు, స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి.