కరీంనగర్ లో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం 

వేలాదిగా తరలివచ్చిన భక్తులు 

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో  శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.  సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో వేదమంత్రోచ్చరణలు, గోవింద నామస్మరణలతో  ఆప్రాంతమంతా మారుమోగింది.

అమ్మవారి తరఫున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్వామి తరఫున ఆలయ ఈవో వెంకన్న,  ధర్మకర్త మండలి చైర్మన్ శ్రీనివాస్, గంగాధర్ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్–-మంజుల దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  వేలాదిగా భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.

భక్తులకు తిరుమల తిరుపతి నుంచి తీసుకువచ్చిన లడ్డూలను పంపిణీచేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు, ఆర్డీవో మహేశ్వర్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి అంజన్ కుమార్,  కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్ ‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీనివాస్, సిటీ  అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, లీడర్లు వెంకటరమణ,  కార్తీక్, అశోక్ గౌడ్, రవిచంద్ర, వీర దేవేందర్, గోపి, రాజ్ ‌‌‌‌‌‌‌‌కుమార్ పాల్గొన్నారు.