శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం.. జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం.. జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అనే ఐదు అంగాలను వివరించేది పంచాంగము. నవనాయకులు, ఉపనాయకులు వాటికి ఆధిపత్యం వహించే నవగ్రహాల ద్వారా ఈ సంవత్సరంలో జరిగే విషయాలు, సంక్రాంతి పురుషుడు లక్షణాలు, 12 రాశుల వారి ఆదాయ–వ్యయములు, రాజపూజ్యం – అవమానములు, రాశుల ఫలితములు తెలియజేసేది గంటల పంచాంగము. ఈ భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి ఫలితములు వర్తించును. దైవభక్తి కలిగినవారైనా, నాస్తికులైనా, గురువు అయినా, శిష్యుడు అయినా వారి వారి జాతకములలో ఉన్నది జరిగి తీరుతుంది. 

ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసిన వారికి, ఆలకించిన వారికి శుభం కలుగుతుంది. పంచాంగ శ్రవణం చేయువారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చునుట శాస్త్ర సమ్మతం. తిథి–సంపదలు, వారం–ఆయుస్సు, నక్షత్రము – పాపాలు తొలగుట, యోగం – వ్యాధులు నివారణ, కరణం–కార్యసిద్ధిని పొందగలరు. భగవంతుని అనుగ్రహం తొందరగా పొందుతారు. పంచాంగ శ్రవణం చేసినవారు, విన్నవారు గంగాస్నానం చేసిన ఫలితం పొందగలరు. సూర్యుని తేజస్సు, చంద్రుని చల్లని కిరణములు, అంగారకుని వలన కార్యసిద్ధి, బుధుని వలన బుద్ధి వికాసం, గురువు వలన గురుకృప, జ్ఞాన సంపద, శుక్రుని వలన ధనయోగం, సుఖము, శని వలన మానసిక వ్యధ తొలగును. రాహువు వలన బాహుబలం, కేతువు వలన వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్ర ప్రమాణం చెపుతుంది.

►ALSO READ | మేష రాశి వారికి ఈ ఏడాది దబిడి దిబిడే.. ఆదాయం 2, ఖర్చేమో..?

ఋతువులలో శ్రేష్టమైనది వసంత ఋతువు. మల్లెపూల సువాసనలతో, కోయిల కూతలతో, పక్షుల కిల కిల ధ్వనులతో, మామిడి చిగురాకులతో, వేపపూతతో ప్రకృతి పరవశింపచేస్తుంది. ఇలాంటి ఆహ్లాదకరమైన కాలంలో మన తెలుగు సంవత్సరాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. ఈ శుభదినమున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. దీప ధూప నైవేద్యాలతో పూజ చేసుకుని కొత్త బెల్లం, కొత్త చింతపండు, వేపపూత, మామిడికాయ, ఉసిరి, అరటిపండు, చెరుకు రసం, కొద్దిగా ఉప్పు వేసుకుని తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవునికి సమర్పించి అనంతరం మీరు సేవించండి.  షడ్రుచులను ఆస్వాదించండి. 

ఉగాది పచ్చడిలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. పులుపు – కష్టసుఖాల కలయిక, చేదు అనేది మరుపురానిది, వేప పువ్వు సర్వతోభద్ర, బెల్లం సత్వర శక్తి. చింతపండు చింతలు తీరుస్తుంది. అరటి పండు ఆరోగ్యం. చెరుకురసం చలువ చేస్తుంది. ఉప్పు శరీర శక్తికి తోడ్పడుతుంది. ఒక యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది. చర్మవ్యాధులు, కామెర్లు, రక్తపోటు, అతిసారము, రక్త దోషము, అజీర్తి, అల్సర్, మధుమేహం వంటి వాటికి వరప్రసాదిని. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు నివారించగలదు.

 ఉగాది రోజున కాకుండా వేపపూత  దొరికినన్ని రోజులు తినుట వలన దేహారోగ్యం కలిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్నిస్తుంది.జన్మ ఇచ్చిన తల్లి మొదటి దైవం, తండ్రి రెండవ దైవం, గురువు మూడవ దైవం, భగవంతుడు నాల్గవ దైవం. మన పూర్వీకులు మనకందించిన సంప్రదాయాలు మరచిపోరాదు. గత స్మరణ చేసుకొన్నవారికి కష్టములు తొలగిపోగలవు. భారతీయ భాషలన్ని సంస్కృతం నుంచి పుట్టినవే! మాతృభాషను వదిలి ఇంగ్లీష్ భాష మోజులో ఉన్నారు. ఒక మతంలో పుట్టి ఇంకొక మతంలోకి మారిపోతున్నారు.

ఏ మతం వారికైనా ప్రత్యక్ష దేవుళ్లు సూర్యచంద్రులే కదా!. తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన గురువు లేడు. తల్లిని మించినది ఈ సృష్టిలోనే లేదు. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి దాని శిల్పి ఒక యజ్ఞంలా పనిచేస్తాడు. అనుక్షణం భగవంతుని స్మరిస్తూ ఆయన రూపాన్ని దర్శిస్తూ విగ్రహానికి రూపం తీసుకొస్తాడు. ఆ సమయంలో ఆయన బండరాయి మీద కూర్చుంటాడు. దాన్ని శిల్పంలా చెక్కిన తర్వాత అది శిల్పం కాదు... సాక్షాత్తు భగవంతుడే అందులో కొలువై ఉంటాడు.. అది అనుభవించినవారికి తెలుస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. ఆయన లేని చోటు లేదు. ఈ శాస్త్రాలు మనం రాయలేదు... ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఋషులు తమ తపశ్శక్తితో రాసి మనకు అందించారు.

ధ్యానము వలన మనలో దాగి ఉన్న మలినములు కరిగిపోగలవు. చీకటి వెలుగుల మధ్య జీవుడు ఉన్నాడు. తమోగుణం వలన జీవసృష్టిలోని రూపములు, రజోగుణము వలన నానా రూపములు, సత్వగుణం వలన నామరూప క్రియ, అధిష్ఠాన జ్ఞానము చేత ధ్యాస ఏకాగ్రతకు చేరును. సృష్ఠి అంతా ఈశ్వరమాయగా వర్ణించినారు.

మహాభారతము 18 పర్వాలు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగినది. భగవద్గీతలోని అధ్యాయాలు 18. వ్యాస మహర్షి రచించిన పురాణాలు 18. మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాము. అలాగే మనిషికి ఉన్న రంధ్రాలు 9. నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 108 పాదాలు. భగవంతున్ని అర్చించే అష్టోత్తరములు 108. ఇలా 9 సంఖ్య ఎంతో విశిష్టమైనది. 

►ALSO READ | రాజకీయ నాయకుల పంచాంగం.. రాజాధి నవనాయకుల ఫలితాలు..!

భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు అనే ఐదు పంచభూతాలు. అలాగే తూర్పున–ఇంద్రుడు, ఆగ్నేయానికి–అగ్ని, దక్షిణం–యమధర్మరాజు, నైరుతిలో–నిరుతి, పడమర–వరుణుడు, వాయువ్యంలో – వాయుదేవుడు, ఉత్తరంలో–కుబేరుడు, ఈశాన్యంలో – ఈశ్వరుడు మొదలైన అష్టదిక్పాలకులు మరియు మధ్యలో బ్రహ్మదేవుడు వాస్తు శాస్త్రాధిపతులు.

రామాయణంలో వాస్తు వివరణ ఉన్నది. భారతంలో వాస్తు లోపము గురించి ఉన్నది. ఖురాన్లో వాస్తు గురించి ఉంది. బైబిల్లో కూడా వాస్తు గురించి ఉంది. మన ఋషులు వారి తపస్సక్తితో మనకు అందించిన వాటిని మరిచిపోకూడదు. తల్లి బిడ్డకు ఏవిధమైన సంబంధమో భగవంతునికి భక్తునికి అదేబంధము. సంక్రాంతి పండుగ రోజున బ్రాహ్మణునికి గుమ్మడికాయ, స్వయంపాకం దానం ఇచ్చినవారికి గత జన్మ కర్మ దోషాలు తొలగిపోవును. నమ్మినవారికి నిజంగా అర్థమవుతుంది. ఆచరించినవారికి అదృష్టం వరిస్తుంది.