- ముగిసిన తాళ సప్తమి వేడుకలు
- వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
కుభీర్, వెలుగు: మరో పండరీపురంగా పేరుగాంచిన కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఏడు రోజులుగా జరుగుతున్న తాళ సప్తమి వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భజన మండళ్లు గురువారం రాత్రి భజనలు చేస్తూ జాగారం చేశారు. శుక్రవారం సూర్యోదయం కంటే ముందు ఆలయంలో నిర్వహించిన కాకడ హారతిలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు.
ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన రథంపై విఠల్రుక్మయి విగ్రహాలను ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయగా భైంసా రూరల్ సీఐ నైలు పర్యవేక్షించారు. జాతరలో కుభీర్కు చెందిన జనత సేవాసమితి ఆధ్వర్యంలో భక్తు లకు సుమారు 40 వేల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.