దేవుడి​ భూముల రికార్డులు గాయబ్​ .. భూముల విలువ రూ. 10 కోట్ల పైనే 

  • రాయికల్‌‌లోని చెన్నకేశవనాథస్వామికి చెందిన 10 ఎకరాలు మాయం
  • బీఆర్ఎస్​ సర్కార్‌‌‌‌ హయాంలో టెంపుల్​ భూములను పట్టించుకోలే
  • సర్కార్​ మారడంతో భక్తుల ఆశలు

జగిత్యాల/రాయికల్, వెలుగు:  జగిత్యాల జిల్లాలో దేవుడి భూములకే  రక్షణ  లేకుండా పోయింది. రాయికల్‌‌లోని శ్రీచెన్నకేశవనాథ ఆలయానికి  చెందిన సుమారు 10 ఎకరాలు రికార్డుల్లో కనిపించడం లేదు. ప్రస్తుత  మార్కెట్​ విలువ ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.10కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై కొంతకాలంగా రాయికల్​వాసులు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ భూములకు సంబంధించి గత బీఆర్​ఎస్​ సర్కార్​ పట్టించుకోకపోగా, కొత్త సర్కార్‌‌‌‌ అయినా భూముల జాడ కనుక్కోవాలని ప్రజలు కోరుతున్నారు. 

700 ఏండ్ల చరిత్ర 

చెన్నకేశవనాథ ఆలయాన్ని సుమారు 700 ఏండ్ల కింద కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. కాశీ ఆలయ తరహాలోనే ఇక్కడా శివలింగం పంచముఖ లింగాన్ని పోలి ఉండటం విశేషమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ శ్రీ చెన్నకేశవనాథ, పంచ ముఖ లింగేశ్వర, సూర్య నారాయణ దేవాలయాలు ఉన్నాయి. 1971 లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరపగా శిల్పాలు, విగ్రహాలు బయటపడ్డాయి. దేవనాగరి లిపిలో ఉన్న కాకతీయుల కాలం నాటి శాసనం లభించింది. ఈ శాసనాన్ని క్రీ.శ 1305 ఆగస్టు17న ప్రతాప రుద్రుడు ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఈ శాసనంలో రుద్ర దేవరవారు, రావికంటి రామనాథ, లఖుమేశ్వరదేవరల వారు ఆలయ అభివృద్ధికి ధనంతో పాటు 10 ఎకరాల భూమి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఆచూకీ లేని విలువైన భూములు 

శాసనాల ఆధారంగా దేవాలయానికి ఇచ్చిన 10 ఎకరాలు ఆచూకీ లభించడం లేదు. గతంలో రాయికల్​తహసీల్​ఆఫీస్‌‌ను నక్సల్స్​దహనం చేయడంతో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌‌ కాలిపోయినట్లు తెలుస్తోంది. రాయికల్ మున్సిపాలిటీగా ఏర్పడడంతో భూముల విలువ పెరిగింది. ఈ మేరకు ఇప్పటి విలువ ప్రకారం ఈ భూములకు రూ.10 కోట్ల పైగానే పలుకుతోంది.  సర్వే నంబర్ల జాడ లేదని ఆఫీసర్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూముల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆలయ భూములపై స్పష్టత లేదు 

ప్రాచీన దేవాలయం గుడికోటకు దానంగా ఇచ్చిన భూములపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రభుత్వం భూముల ఆచూకీ కనిపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టి భూములను గుర్తించి ఆలయ అభివృద్ధికి కృషిచేయాలి.

సామళ్ల సతీశ్‌‌, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రాయికల్

ఆఫీసర్లు పూర్తి స్థాయి  విచారణ జరపాలి

శ్రీ చెన్నకేశవనాథ టెంపుల్ భూముల వివరాలు తెలియడం లేదు. అధికారులు విచారణ చేసి భూములను కాపాడాలి. ఈ విషయంపై చాలా సార్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. భూముల విలువ ఇప్పుడు బాగా పెరిగింది.. భూములను గుర్తిస్తే ఆలయానికి లాభం జరుగుతుంది. 

తుమ్మల సాధశివారెడ్డి,  గుడికోట ఆలయ కమిటీ చైర్మన్