- ఆ విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాల్: మంత్రి శ్రీధర్ బాబు
- బిక్కి ఏర్పాటు మంచి పరిణామం..బీసీ పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తం
- ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అత్యుత్తమమైన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆ విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. సమ్మిళిత అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని చెప్పారు. శనివారం టీహబ్‌లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బీఐసీసీఐ– బిక్కి), టీ కన్సల్ట్ ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాల పారిశ్రామికవేత్తల కోసం బిక్కీని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు.
50 శాతానికిపైగా ఉన్న బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా కార్యక్రమాలు ఉండాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, ఎన్ని సవాళ్లు ఎదురైనా కులగణనను పూర్తి చేస్తున్నామని తెలిపారు. బిక్కి ప్రతిపాదనలకు తగ్గట్టుగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రోత్సాహం ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
117 ఒప్పందాలు
ఇన్వెస్టర్లను ఆవిష్కర్తలతో కలిపేలా టీకన్సల్ట్ నిర్వహించిన సదస్సులో 117 ఒప్పందాలు జరిగాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర, పారిశ్రామికాభివృద్ధికి కొత్త మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం, టీకన్సల్ట్ హెల్త్, డాక్టర్స్ పూల్, ట్యాలెంట్ కనెక్ట్, ఎంఎస్ఎంఈ పాలసీపై చర్చించడం వల్ల కొత్త ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం లభించిందని అన్నారు. 63 దేశాల్లోని సంస్థలతో ఐటీ నిపుణులను అనుసంధానం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు టీకన్సల్ట్ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
మలేషియా, ఆస్ట్రేలియాలతో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌ను కూడా సంస్థ చేపడుతుందని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో బిక్కి వ్యవస్థాపక అవార్డులను ప్రదానం చేశారు. సదస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, బండ ప్రకాశ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, పరిశమల శాఖ జాయింట్ డైరెక్టర్ సురేశ్ సంగా, తదితరులు పాల్గొన్నారు.