రాష్ట్రంలో 6 వేల స్టార్టప్​లు, 1500 సాఫ్ట్ వేర్ ​సంస్థలున్నయ్

  • అన్ని పరిశ్రమలకు హైదరాబాదే గమ్యస్థానం: మంత్రి శ్రీధర్ బాబు
  • రాయదుర్గంలో ఆరిక్ట్​ గ్లోబల్​ఇన్నొవేషన్​ హబ్ ​ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం 6 వేలకుపైగా స్టార్టప్​లు, 1500 చిన్న, మధ్య స్థాయి సాఫ్ట్​వేర్​ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. హైదరాబాద్​అంటేనే ట్యాలెంట్​సిటీ, టెక్​ సిటీ, ఇన్నొవేషన్​ సిటీ అని చెప్పారు. సాఫ్ట్​వేర్​ రంగంలోనే కాకుండా ఫార్మా, బయోటెక్​ వంటి పరిశ్రమలకూ  హైదరాబాద్​ హబ్​గా ఎదిగిందన్నారు. ఇక్కడ ప్రతిభావంతులకు కొదవ లేదని, ప్రపంచస్థాయి మౌలికవసతులున్నాయని, అందుకే అన్ని రకాల పరిశ్రమలకు హైదరాబాద్​ గమ్యస్థానంగా మారిందని వివరించారు. 

శుక్రవారం ఆయన రాయదుర్గంలో ఆరిక్ట్​(ఏఆర్ఐక్యూటీ) అనే సంస్థ గ్లోబల్​ ఇన్నొవేషన్​ హబ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.." ఆరిక్ట్​ సంస్థ గ్లోబల్ ఇన్నొవేషన్​హబ్​ద్వారా 300 మందికి ఉపాధి లభిస్తుంది. స్టార్టప్స్​కు డెస్టినేషన్​గా, గ్లోబల్​ ఇన్నొవేషన్​ హబ్​కు కేరాఫ్​గా తెలంగాణ మరింత వృద్ధి సాధించింది. గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రంలో ఐటీ వృద్ధి గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం.. జాతీయ సగటును మించి నమోదైంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3వేల కోట్ల డాలర్లకు చేరుకుంది" అని మంత్రి వివరించారు. 

జీసీసీలతో ఉపాధి అవకాశాలు మెరుగు

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని, తద్వారా ఐటీ రంగం మరింత పటిష్టం అవుతున్నదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జీసీసీల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగుపడుతున్నాయని చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం యంగ్​ఇండియా స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రజల ఇంటి వద్దకే మెరుగైన పౌర సేవలను చేరవేస్తున్నామన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని వెల్లడించారు.

హైదరాబాద్ లో  పెట్టుబడులు పెట్టాల్సిందిగా సంస్థలను అహ్వానించారు. కొత్త టెక్నాలజీలతో అవకాశాలతోపాటే సవాళ్లూ వస్తున్నాయని, ఆ సవాళ్లపైనా ఇన్నొవేటర్లు, సంస్థల ప్రతినిధులు దృష్టి సారించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సమావేశంలో ఆరిక్ట్​సీఈవో రూపేశ్​కుమార్​, రాష్ట్ర ఐటీ అడ్వైజర్​ సాయి కృష్ణ, ఐటీ స్ట్రాటజిస్ట్​ శ్రీకాంత్​ లంక తదితరులు పాల్గొన్నారు.