కోచింగ్ సెంటర్లను కంట్రోల్​లో పెడ్తం: శ్రీధర్ బాబు

కోచింగ్ సెంటర్లను కంట్రోల్​లో పెడ్తం: శ్రీధర్ బాబు
  • కేంద్ర గైడ్​లైన్స్ అమలు చేస్తం: మంత్రి శ్రీధర్ బాబు
  • ఫీజుల నియంత్రణపై కమిటీ ఏర్పాటును పరిశీలిస్తం
  • సర్కార్ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా మారుస్తామని వెల్లడి
  • ఫీజుల భారంతో పేరెంట్స్ ఇబ్బందిపడ్తున్నరు: మంత్రి సీతక్క
  • కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. విద్యారంగ సంస్కరణలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలు, ఎంసెట్, నీట్ లాంటి ఎంట్రెన్స్ టెస్టుల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్లను కంట్రోల్ చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేంద్రం రూపొందించిన గైడ్​లైన్స్ ను రాష్ట్రంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కోచింగ్ సెంటర్లపై నియంత్రణ లేకపోవడంతో అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కమిటీ ఏర్పాటుకు పరిశీలిస్తామని చెప్పారు. బుధవారం విద్యారంగ సంస్కరణలపై సెక్రటేరియెట్​లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి సీతక్కతో కలిసి శ్రీధర్ బాబు పలు అంశాలపై చర్చించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు.. నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని శ్రీధర్ బాబు అన్నారు. సర్కారు స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా మారిస్తే పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. స్టూడెంట్లు లేని 1,600 స్కూళ్లలోని టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలన్నారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లు వేర్వేరుగా నడుస్తుండటంతో, మానవ వనరులు వృథా అవుతున్నాయని, ఈ రెండింటినీ విలీనం చేసే అంశంపై స్టడీ చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు.

ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్​గ్రేడ్

రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ‘‘మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తాం. డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ స్టూడెంట్లను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తాం. తద్వారా వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన వస్తుంది. ఎడ్యుకేషన్ సెక్టార్​లో ఏఐను వినియోగించుకోవాలి. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయి. స్టూడెంట్స్​లో సృజనాత్మకతను బయటకు తెచ్చేలా ప్రతి కాలేజీ.. డిజిటల్ మ్యాగజైన్ నడపాలి. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలి’’అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

సమాజం గురించి పిల్లలకు చెప్పాలి: మంత్రి సీతక్క

విద్యా సంస్థల్లో పాఠాలే కాకుండా సమాజం కోసం ఆలోచించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క అన్నారు. ‘‘మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో 5, 6వ తరగతుల పుస్తకాల్లో చేర్చాలి. టాలెంటెడ్ టీచర్లున్నా.. స్టూడెంట్లు ప్రైవేటు స్కూల్స్​కు ఎందుకు పోతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఫీజుల భారంతో పేరెంట్స్ ఇబ్బందులుపడ్తున్నరు. ఫీజులపై నియంత్రణ లేకపోతే ఎలా?’’అని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​పై ప్రజెంటేషన్ ఇచ్చారు. భేటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఇంటర్ బోర్డు సెక్రెటరీ శృతి ఓజా, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ హరిత, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లు లింగయ్య, రమేశ్, టెక్నికల్, హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు శ్రీనాథ్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం: కేటీఆర్​పై సీతక్క ఫైర్

అబ‌‌‌‌ద్ధాల‌‌‌‌కు అంబాసిడ‌‌‌‌ర్ గా మారిన కేటీఆర్.. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం విష‌‌‌‌యంలో అవాకులు చ‌‌‌‌వాకులు పేలుతున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన  సీఎం బ్రేక్ ఫాస్ట్​ స్కీమ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారని కేటీఆర్​చేసిన ట్వీట్​పై మంత్రి స్పందించారు. ‘తొమ్మిద‌‌‌‌న్నరేండ్లు అధికారంలో ఉండి.. ఏనాడు ప్రభుత్వ పాఠ‌‌‌‌శాలల పిల్లల ఆక‌‌‌‌లిని ప‌‌‌‌ట్టించుకోని మీరు.. ఎన్నిక‌‌‌‌ల షెడ్యూల్ కు కేవ‌‌‌‌లం మూడంటే మూడు రోజుల ముందే మొక్కుబ‌‌‌‌డిగా వేళ్ల మీద లెక్కబెట్టేన్ని పాఠ‌‌‌‌శాల‌‌‌‌ల్లో ప్రారంభించి చేతులు దులుపుకున్నారు’ అని బుధవారం ప్రకటనలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గైడ్ లైన్స్, బడ్జెట్ కేటాయింపులు లేకుండానే ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టి నయా పైసా ఖ‌‌‌‌ర్చు చేయ‌‌‌‌కుండా పురిట్లోనే చంపేశారని ఆరోపించారు. ఏజెన్సీల‌‌‌‌కు మీరు ప‌‌‌‌డ్డ బకాయి రూ.3.5 కోట్లను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని మంత్రి గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయాల‌‌‌‌ని కేంద్ర ప్రభుత్వమే నియమించిన నిపుణుల క‌‌‌‌మిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదిక‌‌‌‌ను గుర్తు చేస్తూ.. బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రవేశ పెట్టాల‌‌‌‌ని కేంద్రాన్ని కోరితే మీకొచ్చిన అభ్యంత‌‌‌‌రం ఏంటి? రాష్ట్రాల నుంచి ప‌‌‌‌న్నులు, శిస్తుల రూపంలో కేంద్రానికి నిధులు వెళుతున్నప్పుడు, కేంద్రం నుంచి నిధులు అడిగితే మీకెందుకు ఉలికి పాటు?’ అని మంత్రి ప్రశ్నించారు.